బాధితుడి ప్రార్థన, కృశించిపోయినవాడై యెహోవా ఎదుట పెట్టిన మొర.
102
1 యెహోవా, నా ప్రార్థన విను.
నా మొర నీకు చేరనియ్యి.
2 నేను కష్టంలో ఉన్న రోజు నీ ముఖం నాకు
కనబడకుండా చేయబోకు.
నా ఆక్రందన చెవిని బెట్టి, నేను మొరపెట్టే
రోజు నాకు శీఘ్రంగా జవాబివ్వు.
3 నా రోజులు పొగలాగా హరించుకుపోతున్నాయి.
పొయ్యిలో నా ఎముకలు కాలిపోతున్నాయా
అనిపిస్తుంది.
4 నా గుండె ఎండకు వాడిపోయిన గడ్డిలాంటిది.
భోం చెయ్యాలనే సంగతే మరిచిపోతాను.
5 నేను స్వరమెత్తి మూలుగుతూ ఉన్నందుచేత
నా ఎముకలు కనబడేటంతగా
నా శరీరం చిక్కిపోయింది.
6 నేను అడవిబాతులాంటివాణ్ణి.
శిథిల ప్రదేశాలలోని గుడ్లగూబలాగా ఉన్నాను.
7 రాత్రంతా మెళుకువగా ఉన్నాను.
ఇంటికప్పు మీద ఉన్న ఒంటరి పిచ్చుకలాగా
ఉన్నాను నేను.
8 రోజంతా నా శత్రువులు నన్ను
ఆడిపోసుకుంటున్నారు.
నన్ను వెర్రిగా దూషించే వాళ్ళు నా పేరెత్తి శపిస్తారు.
9 నీ కోపాగ్ని బట్టి, నీ ఆగ్రహం బట్టి నేను
బూడిదను ఆహారంగా తింటున్నాను.
10 నా పానీయం కన్నీళ్ళతో కలుపుతున్నాను.
నీవు నన్ను పైకెత్తి అవతల పారవేశావు.
11  నా రోజులు సాయంకాలం నీడలాగా ఉన్నాయి.
నేను గడ్డిలాగా వాడిపోతున్నాను.
12 యెహోవా, నీవు శాశ్వతంగా రాజువై ఉంటావు.
అన్ని తరాలవారు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు.
13 నీవు లేచి సీయోను నగరాన్ని కనికరిస్తావు.
నీవు దానిమీద దయ చూపవలసిన సమయం
రానే వచ్చింది. ఇది నిర్ణీత కాలం.
14 దాని రాళ్ళంటే నీ సేవకులకు ఎంతో ఇష్టం.
దాని మట్టిని జాలితో చూస్తారు.
15 ఇతర ప్రజలు యెహోవా పేరుకు భయపడుతారు.
భూరాజులంతా నీ వైభవానికి భయపడుతారు.
16 ఎందుకంటే, యెహోవా సీయోన్ను మళ్ళీ
కట్టించినప్పుడు తన వైభవంలో ప్రత్యక్షం
అవుతాడు.
17 దిక్కుమాలిన దరిద్రుల ప్రార్థన వైవు ఆయన
మొగ్గుతాడు.
వారి ప్రార్థన ఆయన నిరాకరించడు.
18 రాబోయే తరాలకు ఇలా రాసిపెట్టి ఉంటుంది –
ఉనికి లోకి రాబోయే ప్రజ యెహోవాను స్తుతిస్తారు:
19 “బందీల మూలుగులు వినడానికి,
చావుకు నియమించబడ్డవారికి విడుదల
ప్రసాదించడానికి
20 యెహోవా ఎత్తయిన తన పవిత్ర స్థలం నుంచి
కిందికి వంగాడు.
పరలోకంనుంచి భూమిని చూశాడు.”
21 ఆ విధంగా మనుషులు సీయోనులో యెహోవా
పేరుప్రతిష్ఠలు వివరిస్తారు,
జెరుసలంలో ఆయన కీర్తి ప్రకటిస్తారు.
22 అప్పుడు యెహోవాకు సేవ చేయడానికి
రాజ్యాలూ ప్రజలూ సమకూడి ఉంటారు.
23 నా మార్గం మధ్యలో ఆయన నా బలం
నీరసించేలా చేశాడు.
నా రోజులు ఆయన తక్కువ చేశాడు.
24 నేనిలా వేడుకొన్నాను: “నా దేవా,
నా రోజుల మధ్యలో నన్ను తీసుకుపోవద్దు.
నీ సంవత్సరాలు తరతరాలుగా సాగుతాయి.
25 ఆరంభంలో నీవు భూమికి పునాది వేశావు.
ఆకాశాలు కూడా నీవు చేతితో చేసినవే.
26  అవి అంతరించిపోతాయి. నీవైతే ఉంటావు.
అవి అన్నీ వస్త్రంలాగా పాతబడిపోతాయి.
నీవు వాటిని దుస్తుల్లాగా మార్చివేస్తావు,
అవి మార్చబడుతాయి.
27 కాని, నీవు ఒకే తీరున ఉంటావు.
నీ సంవత్సరాలకు అంతం ఉండదు.
28  నీ సేవకుల పిల్లలు నీ సమక్షంలో నివాసం చేస్తారు,
వారి వంశం సుస్థిరంగా ఉంటుంది.