దావీదు కీర్తన
101
1 ✽నేను కృపను, న్యాయాన్ని గురించి పాడుతాను.యెహోవా, నిన్ను ఉద్దేశించి
గీతం ఆలపిస్తాను.
2 లోపం లేని విధానంలో జ్ఞానంతో ప్రవర్తిస్తాను.
నీవెప్పుడు నా దగ్గరికి వస్తావు?
నేను ఆంతర్యంలో నిజాయితీ పరుడనై
నా ఇంటిలో మసులుకొంటాను.
3 ✽వ్యర్థమైన వాటిని నా కండ్లకు కనబడనివ్వను.
నీ మార్గం విడిచిపెట్టినవాళ్ళ క్రియలంటే
నాకు అసహ్యం.
అవి నన్ను అంటకుండా చూచుకుంటాను.
4 ✝కుటిల హృదయం నాకు
దూరమవుతుంది.
దుర్మార్గాన్ని నేను అనుసరించను.
5 ✽ పొరుగువాణ్ణి చాటుగా అపనిందలకు గురిచేసే
వాళ్ళను నేను హతం చేస్తాను.
మిడిసిపడే వాళ్ళను, గర్విష్ఠి హృదయులను
నేను సహించను.
6 ✽దేశంలో నమ్మకమైనవారు నా చుట్టూరా
ఉండాలని వారిమీదే నా దృష్టి ఉంటుంది.
లోపం లేని విధానంలో ప్రవర్తించే వాళ్ళే నాకు
సేవ చేస్తారు.
7 ✽ మోసం అభ్యసించేవాళ్ళు నా భవనంలో ఉండడానికి
వీల్లేదు.
అబద్ధాలాడేవాడు నా కళ్ళ ఎదుట నిలవడానికి
వీల్లేదు.
8 ✽ప్రతి ఉదయమూ దేశంలోని దుర్మార్గులందరినీ
నేను హతమారుస్తాను.
యెహోవా నగరంలో పాపాత్ములందరినీ
లేకుండా చేస్తాను.