ఒక కీర్తన
98
1 ✽యెహోవాను గురించి కొత్త పాట పాడండి.ఆయన అద్భుతాలు✽ చేశాడు.
ఆయన కుడిచెయ్యి✽, ఆయన పవిత్ర హస్తం
ఆయనకు విజయం చేకూర్చింది.
2 ✝యెహోవా తన రక్షణను వెల్లడి చేశాడు.
ఇతర ప్రజల ఎదుట తన న్యాయాన్ని
బయలుపరచాడు.
3 ఇస్రాయేల్‌వంశం వారికి తన అనుగ్రహం,
విశ్వసనీయత ఆయన జ్ఞాపకముంచుకొన్నాడు✽.
భూమి కొనలన్నిటికీ✽ మన దేవుని రక్షణ
కనబడింది.
4 ✽సర్వలోకమా! యెహోవాకు ఆనంద ధ్వనులు చెయ్యి!
ఉద్రేకంతో ఆనంద గీతాలు ఆలపించు!
పాటలు పాడు!
5 తంతి వాద్యంతో యెహోవాకు స్తుతిగీతాలు పాడు!
తంతి వాద్యంతో గానం చెయ్యి!
6 బూరలతో, పొట్టేలు కొమ్ములతో రాజైన
యెహోవా ఎదుట ఆనంద ధ్వనులు చెయ్యి!
7 ✝సముద్రం, దానిలో ఉన్నదంతా
హోరుమంటుంది గాక!
లోకమూ, లోకప్రజలూ నినాదాలు చేస్తారు గాక!
8 యెహోవా సన్నిధానంలో నదులు కరతాళ
ధ్వనులు చేస్తాయి గాక!
ఆనందంతో కొండలన్నీ కలిసి పాడుతాయి గాక!
9 ఎందుకంటే యెహోవా లోకానికి తీర్పు
తీర్చడానికి రాబోతున్నాడు.
న్యాయంతో ఆయన లోకప్రజలకు,
నిజాయితీతో జనాలకు తీర్పుతీరుస్తాడు.