97
1 ✽యెహోవా పరిపాలిస్తున్నాడు.భూమి ఆనందిస్తుంది గాక!
ద్వీపాలన్నీ సంతోషిస్తాయి గాక!
2 ✽మేఘాలు, దట్టమైన చీకటి ఆయనను
ఆవరించి ఉన్నాయి.
నిజాయితీ, న్యాయమూ✽ ఆయన సింహాసనానికి
పునాదిగా ఉన్నాయి.
3 ✝ఆయన ఎదుటనుంచి మంటలు బయలు దేరుతాయి,
చుట్టూరా ఉన్న ఆయన శత్రువులను కాల్చివేస్తాయి.
4 ✝ఆయన మెరుపులు లోకాన్ని ప్రకాశవంతం చేస్తాయి.
భూమి దానిని చూచి వణికిపోతుంది.
5 ✝యెహోవా సన్నిధానంలో,
సర్వ ప్రపంచానికీ ఉన్న ఆ ప్రభువు ఎదుట,
పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయి.
6 ✝ఆకాశాలు ఆయన నీతిన్యాయాలను ప్రకటిస్తున్నాయి.
సర్వలోక ప్రజలు ఆయన తేజస్సు✽ను చూస్తారు.
7 చెక్కిన విగ్రహాలు పూజిస్తూ, ఆ వ్యర్థమైన
వాటినిబట్టి అతిశయించే వాళ్ళకు సిగ్గు✽,
ఆశాభంగం కలుగుతాయి.
దేవుళ్ళనబడ్డవాళ్ళంతా ఆయనకు సాష్టాంగ
నమస్కారాలు చెయ్యాలి!
8 ✽యెహోవా! సీయోను ఇది విని,
న్యాయ సమ్మతమైన నీ తీర్పుల కారణంగా
సంతోషిస్తూ ఉంది.
యూదా కుమార్తెలు✽ ఆనందిస్తూ ఉన్నారు.
9 యెహోవా! ప్రపంచమంతటికీ పైగా ఉన్న
సర్వాతీతుడివి నీవే.
నీవు దేవుళ్ళందరికీ ఎంతో ఉన్నతంగా ఉన్నావు.
10 ✽యెహోవాను ప్రేమించేవారలారా!
చెడుతనాన్ని అసహ్యించుకోండి✽.
తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడుతాడు✽.
దుర్మార్గుల బారినుంచి ఆయన వారిని తప్పిస్తాడు.
11 ✽న్యాయవంతులకు వెలుగును వెదజల్లుతాడు.
హృదయంలో నిజాయితీ ఉన్నవారికి ఆనందాన్ని
వెదజల్లుతాడు.
12 న్యాయవంతులారా, యెహోవామూలంగా
ఆనందించండి.
ఆయన పవిత్రమైన పేరును బట్టి కృతజ్ఞత
అర్పించండి.