96
1 యెహోవాను గురించి క్రొత్త పాట పాడండి.
సర్వలోక ప్రజలారా,
యెహోవాను సంకీర్తనం చేయండి,
2 యెహోవా పాటలు పాడండి,
ఆయన పేరును స్తుతించండి.
ప్రతి రోజూ ఆయన రక్షణను
చాటించండి.
3  ఇతర జనాలలో ఆయన మహిమను
తెలియజేయండి.
అన్ని దేశాల ప్రజలలో ఆయన అద్భుతాలను
వివరించండి.
4 యెహోవా గొప్పవాడు.
ఆయన అత్యంత స్తుతికి యోగ్యుడు.
దేవుళ్ళందరికంటే భయభక్తులకు పాత్రుడు.
5 ఎందుకంటే, జనాల దేవుళ్ళంతా విగ్రహాలు
మాత్రమే.
యెహోవా ఆకాశాలను సృజించాడు.
6 ఘనత, వైభవం ఆయన సన్నిధానంలో ఉన్నాయి.
బలం, శోభ ఆయన పవిత్రాలయంలో ఉన్నాయి.
7 జనాంగాల్లారా, యెహోవాకు ఆరోపించండి,
మహత్తు, బలం యెహోవాకు ఆరోపించండి.
8 యెహోవా పేరుకు చెందే మహత్తు ఆయనకు
ఆరోపించండి.
నైవేద్యం చేతపట్టుకొని ఆయన ఆవరణాలలో
ప్రవేశించండి.
9  పవిత్రత అనే అలంకారంతో యెహోవాను
ఆరాధించండి.
సర్వలోక ప్రజలారా! ఆయన సమక్షంలో వణకండి.
10 జనాలలో ఇలా ప్రకటించండి:
“యెహోవా పరిపాలన చేస్తున్నాడు.”
లోకం స్థిరంగా ఉంది. అది కదలదు.
ఆయన పక్షపాతం లేకుండా జనాలకు
తీర్పు తీరుస్తాడు.
11 యెహోవా రాబోతున్నాడు!
యెహోవా ఎదుట ఆకాశాలు ఆనందిస్తాయి గాక!
భూమి సంతోషిస్తుంది గాక!
సముద్రం, దానిలో ఉన్నదంతా
హోరుమంటుంది గాక!
12 మైదానాలు, వాటిలో ఉన్నదంతా
ఆనంద ధ్వనులు చేస్తాయి గాక!
అడవి చెట్లన్నీ ఉత్సాహంతో కేకలు వేస్తాయి గాక!
13 ఎందుకంటే, యెహోవా రాబోతున్నాడు.
భూమిమీది ప్రజానీకానికి తీర్పు తీర్చడానికి
ఆయన వేంచేస్తున్నాడు.
ఆయన న్యాయంతో లోక ప్రజలకు తీర్పు తీరుస్తాడు.
తన సత్యాన్ని అనుసరించి జనాలకు న్యాయం
చేకూరుస్తాడు.