95
1 ✽ రండి, యెహోవా సంకీర్తనం ఉత్సాహంతోచేద్దాం పట్టండి.
మన రక్షణకు ఆధారశిల అయిన ఆయన్ను
గురించి ఆనంద ధ్వనులు చేద్దాం.
2 కృతజ్ఞతతో ఆయన సన్నిధానంలోకి వద్దాం.
కీర్తన రూపంలో ఆయన్ను గురించి
ఆనంద ధ్వనులు చేద్దాం.
3 ✽యెహోవా గొప్ప దేవుడు.
దేవుళ్ళందరి పైగా ఉన్న మహారాజు.
4 ఆయన చేతిలో భూమి యొక్క
అగాధ స్థలాలన్నీ ఉన్నాయి.
పర్వత శిఖరాలూ ఆయనవే.
5 సముద్రం కూడా ఆయనదే.
దానిని సృజించినది ఆయనే.
తన చేతులతో ఆరిన నేలను నిర్మించాడు.
6 రండి, సాగిలపడి ఆయనను ఆరాధన చేద్దాం.
మన సృష్టికర్త అయిన యెహోవా ఎదుట
మోకరిల్లుదాం.
7 ఆయన మన దేవుడు.
మనం ఆయన పోషించే ప్రజలం,
ఆయన చేతిక్రింది గొర్రెలం.
8 ✽ఈ రోజు ఆయన స్వరం మీరు వింటే,
మీ పూర్వీకుల్లాగా మీ గుండె బండబారిపోయేలా
చేసుకోకండి.
మెరీబా దగ్గర, ఎడారిలో మస్సా దగ్గర ఉన్న
సమయంలో,
9 “వారు నన్ను శోధిస్తూ పరీక్షించారు.
నా కార్యకలాపాలు చూశారు కూడా.
10 ✽నలభై సంవత్సరాలు నేను ఆ తరంవారితో
విసికి వేసారిపోయాను.
వారి హృదయాలు ఎప్పుడూ పెడత్రోవ
పట్టుతున్నాయి.
నా త్రోవలు వాళ్ళు ఎరగనే ఎరుగరు అన్నాను.
11 ✽గనుక నేను ఆగ్రహంతో వారు నా విశ్రాంతి
స్థలంలో చేరరు అని శపథం చేశాను”
అని యెహోవాఅంటున్నాడు.