94
1 ప్రతీకారం చేసే దేవా! యెహోవా!
ప్రతీకారం చేసే దేవా!
నీ ప్రకాశం కనుపరచు!
2 ప్రపంచానికి తీర్పు తీర్చేవాడా! లే!
గర్విష్ఠులకు తగ్గ ప్రతిఫలం ముట్టేలా చెయ్యి!
3 దుర్మార్గులు ఎంత కాలమని సంతోషంతో
ఉప్పొంగుతారు?
యెహోవా! దుర్మార్గులు ఎంతవరకు ఇలా
సంతోషిస్తారు?
4 వాళ్ళు ఏవేవో వాగుతూ,
సిగ్గుమాలిన రీతిగా మాట్లాడుతున్నారు.
చెడుగు చేసేవాళ్ళంతా గొప్పలు చెప్పుకొంటారు.
5 యెహోవా! వాళ్ళు నీ ప్రజలను అణిచివేస్తున్నారు.
నీ సొత్తును బాధిస్తున్నారు.
6 విధవరాండ్రనూ విదేశీయులనూ చంపుతారు.
అనాథలను హత్య చేస్తారు.
7  “యెహోవా ఇదంతా చూడ్డం లేదులే.
యాకోబు యొక్క దేవుడు ఇదంతా గమనించడు”
అనుకుంటున్నారు.
8 ప్రజల్లో పశుప్రాయులారా, బుద్ధి తెచ్చుకోండి!
మూర్ఖులారా, మీకెప్పుడు తెలివి వస్తుంది?
9 చెవులిచ్చినవాడు వినలేడా?
కండ్లను రూపొందించినవాడు చూడలేడా?
10 జనాలను శిక్షించేవాడు మిమ్మల్ని శిక్షించడా?
11 మనుషుల తలంపులు వృథా అని
యెహోవాకు తెలుసు.
12 యెహోవా! నీచేత క్రమశిక్షణ పొందిన వ్యక్తులు
ధన్యజీవులు.
ధర్మశాస్త్రోపదేశం నీవల్ల నేర్చుకొనేవారు ధన్యులు.
13 అలాంటివారిని కీడు అనుభవించిన రోజులనుంచి
విడిపించి, దుర్మార్గులకోసం గుంట తవ్వడం
జరిగేవరకు విశ్రమించేలా చేస్తావు.
14 యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు.
తన సొత్తును విసర్జించడు.
15 న్యాయస్థానంలో ధర్మ సంస్థాపన జరుగుతుంది.
నిజాయితీ పరులంతా ఆ ప్రకారం ప్రవర్తిస్తారు.
16 చెడుగు చేసేవాళ్ళ ఎదుట నా పక్షాన ఎవరు
నిలుస్తారు?
దోషులకు ప్రతికూలంగా నా పక్షాన నిలిచేదెవరు?
17 యెహోవాయే గనుక నాకు సహాయం చేసి
ఉండకపోతే మౌన ప్రదేశంలోకి
త్వరలోనే తరలిపోయి ఉండేవాణ్ణే.
18 నేను “నా కాలు జారింది” అనుకొంటే,
యెహోవా, నీ అనుగ్రహం నన్ను ఎత్తి పట్టుకొంది.
19 నాకు ఆందోళన కలిగించే తలంపులు
ఎక్కువవుతూ ఉంటే
నీవు అనుగ్రహించే ఆదరణలు నా ప్రాణానికి
హాయి చేకూరుస్తాయి.
20 దుర్మార్గుల పరిపాలనతో నీకు సంబంధమేమిటి?
కీడు చేద్దామని వాళ్ళు చట్టం కల్పిస్తారు.
21 వాళ్ళు న్యాయవంతుల ప్రాణాలు తీయడానికి
గుమికూడి వారి పైబడతారు.
నిర్దోషులమీద నేరం మోపి మరణ శిక్ష విధిస్తారు.
22 కాని యెహోవా నాకు ఎత్తయిన కోటలాంటివాడు.
నా దేవుడు నాకు ఆశ్రయమిచ్చే ఆధారశిల.
23 ఆయన వాళ్ళ దోషాలు వాళ్ళ నెత్తిమీదికే తెస్తాడు.
వాళ్ళ చెడుతనంలోనే వాళ్ళను నాశనం చేస్తాడు.
మన దేవుడైన యెహోవా వాళ్ళను నాశనం చేస్తాడు.