91
1 ✽సర్వాతీతుని చాటున నివసించేవారుఅమిత శక్తిమంతుని నీడలోనే విశ్రమించేవారు.
2 నేను యెహోవాను గురించి ఇలా అంటాను:
“నా ఆశ్రయ స్థానం✽ ఆయనే,
నాకు కోట ఆయనే.
నేను నమ్ముకొన్న నా దేవుడు ఆయనే.”
3 ✽వేటగాడు వేసిన వలనుంచి ఆయన నిన్ను
విడిపిస్తాడు.
చావగొట్టు విపత్తునుంచి ఆయన నిన్ను రక్షిస్తాడు.
4 తన రెక్కలతో నిన్ను కప్పుతాడు.
ఆయన రెక్కల✽ క్రింద నీకు ఆశ్రయం
దొరుకుతుంది.
ఆయన సత్యం డాలు✽లాంటిది, కవచంలాంటిది.
5 ✽రాత్రిపూట భయపెట్టేవాటికి నీకు నదురూ
బెదురూ ఉండదు.
పగటిపూట ఎగిరి వచ్చే బాణాలంటే నీకు
భయం ఉండదు.
6 చీకట్లో తచ్చాడే విపత్తుకు,
మధ్యాహ్నం సంభవించే నాశనానికి
నీవు భయపడవు.
7 ✽నీ ప్రక్కనే వెయ్యిమంది కూలినా,
పది వేలమంది నీ కుడిచేతివైపున నేల కొరిగినా
ఆ కీడు నీ దరిదాపులకు రాదు.
8 ✽ కన్నులారా నీవు చూస్తూ ఉండగానే
దుర్మార్గులకు ప్రతిఫలం ముడుతుంది.
9 ✽నా ఆశ్రయ స్థానమైన యెహోవాను,
సర్వాతీతుణ్ణి నీకు నివాసంగా చేసుకొన్నావు,
10 ✝గనుక హాని ఏమీ నిన్ను సోకదు.
దెబ్బ ఏదీ నీ ఇంటిదగ్గరికి కూడా రాదు.
11 ✽నీ విధానాలన్నిటిలో నిన్ను కాపాడేందుకు
దేవుడు తన దూతలకు నిన్ను గురించి
ఆజ్ఞాపిస్తాడు.
12 వారు నీ పాదాలకు రాయి తగలకుండా
నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు.
13 ✽సింహం మీదుగా, విష సర్పం మీదుగా
నీవు నడిచిపోతావు.
క్రూర సింహాన్ని, రెక్కలున్న సర్పాన్ని
కాళ్ళక్రింద త్రొక్కుతావు.
14 ✽“అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక
అతణ్ణి తప్పిస్తాను.
అతనికి నా పేరు తెలుసు.
అందుచేత అతణ్ణి పైన కూర్చోబెడతాను.
15 అతడు నన్ను ప్రార్థించేటప్పుడు నేను
జవాబిస్తాను.
కష్టాలలో అతనికి నేను అండగా ఉంటాను.
నేను అతణ్ణి విడిపిస్తాను, అతణ్ణి గౌరవిస్తాను.
16 అతనికి దీర్ఘాయువును ప్రసాదించి సంతృప్తి
కలిగిస్తాను.
నా రక్షణ అతడు చూచేలా చేస్తాను”
అని యెహోవా అంటున్నాడు.