నాలుగో భాగం
(కీర్తనలు 90—106)
దేవుని మనిషి మోషే చేసిన ప్రార్థన
90
1 ప్రభూ! తరతరాలుగా నీవే మాకు నివాస స్థానం.
2 పర్వతాలు ఉనికిలోకి రాకముందే భూమిని,
లోకాన్ని నీవు సృష్టించకముందే నీవే దేవుడివి,
శాశ్వతుడైన దేవుడివి.
3 నీవు మనుషులను మన్ను చేస్తావు.
“మనుషులారా, తిరిగి రండి!” అంటావు.
4 నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గతించినప్పుడు
అదంతా నిన్నటి రోజులాగా ఉంది.
అది రాత్రి జాము గతించినట్టే ఉంటుంది.
5 వరదలో కొట్టుకుపోయినవారిలాగా వారిని నీవు
తీసుకుపోతావు. వాళ్ళు నిద్రపోతారు.
పొద్దున మొలిచే గడ్డిపరకలాగా
ఉన్నారు వారు.
6 ఉదయం అది మొలుస్తుంది,
పెరుగుతుంది.
సాయంకాలం అది వాడిపోతుంది,
ఎండిపోతుంది.
7 మేము నీ కోపం చేత హరించుకుపోతున్నాం.
నీ కోపాగ్ని మాకు ఎంతో భయం కలిగిస్తూ ఉంది.
8 మా అపరాధాలను నీ ఎదుట పెట్టుకొన్నావు.
నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు
కనబడుతూ ఉన్నాయి.
9 నీ ఆగ్రహం భరిస్తూ మా రోజులన్నీ
గడుపుతున్నాం.
మా జీవిత కాలమంతా నిట్టూర్పులు విడిచినట్టే
గడిచిపోతుంది.
10 మా ఆయుష్కాలమంతా కలిపితే డెబ్భై ఏళ్ళు,
అంతగా బలం ఉంటే ఎనభై సంవత్సరాలు.
వాటిలో శ్రేష్ఠమైనవి కూడా ప్రయాస, బాధ,
మా సంవత్సరాలు ఇట్టే గతించిపోతాయి.
మేము శీఘ్రంగా దాటుకుంటాం.
11 నీ కోపం ఎంత తీవ్రమో ఎవరికి తెలుసు?
నీకు చెందవలసిన భయభక్తుల ప్రకారం
నీ ఆగ్రహం ఎంతో ఎవరికి తెలుసు?
12 మాకు జ్ఞానం గల హృదయం కలగాలి.
అందుచేత మా రోజులు సరిగా
లెక్కపెట్టుకోవడం మాకు నేర్పు.
13 యెహోవా, మా దగ్గరికి తిరిగి రా!
ఎంత కాలం ఇలా రాకుండా ఉంటావు?
నీ సేవకుల విషయం పరితపించు.
14 ఉదయకాలంలోనే నీ అనుగ్రహంతో మాకు
తృప్తి చేకూర్చు.
అప్పుడు మేము బ్రతికినన్ని రోజులు ఆనందిస్తాం,
ఉల్లసిస్తాం.
15 నీవు మమ్మల్ని దీనావస్థలో ఉంచిన
కాలం కొలది, మేము కీడును చూచిన
ఏళ్ళకొలది మేము సంతోషించేలా చెయ్యి.
16 నీ పని నీ సేవకులకు కనబడనియ్యి.
వారి సంతానంమీద నీ ఘనత కనబడనియ్యి.
17 మా దేవుడైన యెహోవా మనోహరత్వం మనమీద
ఉంటుంది గాక!
మేము చేసిన పనిని నీవే సుస్థిరం చెయ్యి.
మేము చేసే పనిని సుస్థిరం చెయ్యి.