ఎజ్రా వంశంవాడైన ఏతాన్‌రాసిన దైవధ్యానం
89
1 యెహోవా కరుణాక్రియలు నేను ఎప్పుడూ
సంకీర్తనం చేస్తాను.
రాబోయే తరాలన్నిటికీ నా నోరార
నీ విశ్వసనీయతను తెలియజేస్తాను.
2 “కరుణ శాశ్వతంగా సుస్థిరంగా ఉంటుంది.
పరలోకంలో నీ విశ్వసనీయతను స్థాపిస్తావు”
అంటున్నాను నేను.
3 “నేను నియమించిన వ్యక్తితో ఒడంబడిక
చేసుకొన్నాను.
నా సేవకుడైన దావీదుకు ఇలా ప్రమాణం చేశాను:
4 నీ సంతానాన్ని ఎప్పటికీ నేను స్థాపిస్తాను.
తరతరాలకు నీ సింహాసనం సుస్థిరం చేస్తాను”
అన్నావు. (సెలా)
5 యెహోవా, ఆకాశాలు నీ అద్భుతాలను కీర్తిస్తాయి.
పవిత్రుల సమావేశంలో నీ విశ్వసనీయతకు
స్తుతులు కలుగుతాయి.
6 ఆకాశాలలో యెహోవాకు సాటి ఎవడు?
దేవ కుమారులలో యెహోవాలాంటి వాడెవడు?
7 పవిత్రుల సభలో ఆయన మహా
భయంకరుడైన దేవుడు.
తన చుట్టూరా ఉన్న వారందరిలో ఆయన
భయంకరుడు.
8 యెహోవా, సేనల ప్రభువైన దేవా,
నీ లాంటివాడెవడు?
యెహోవా, నీవు మహా బలాడ్యుడివి.
నీ విశ్వసనీయత నిన్ను ఆవరించి ఉంది.
9 ఉప్పొంగే సముద్రాన్ని అదుపులో ఉంచుతావు.
అలలు ఉవ్వెత్తుగా లేస్తే,
వాటిని అణిచివేస్తావు.
10 రాహాబును నలగ్గొట్టి హతురాలుగా చేశావు.
నీ బలిష్ఠమైన హస్తంతో నీ శత్రువులను
చెదరగొట్టివేశావు.
11 ఆకాశాలు నీవి. భూమి నీది.
భూమి, అందులో ఉన్నదంతా నీవు నెలకొల్పినదే.
12 ఉత్తర దక్షిణ దిక్కులను నీవే సృజించావు.
తాబోర్, హెర్మోన్‌పర్వతాలు నీ పేరుకు
ఆనంద ధ్వనులు చేస్తున్నాయి.
13 నీకు బలిష్ఠమైన హస్తం ఉంది.
నీ చేయి బలిష్ఠమైనది.
నీ కుడి చేతికి ఆధిక్యత ఉంది.
14 నీతి నిజాయితీ, న్యాయం నీ సింహాసనానికి
ఆధారాలు.
అనుగ్రహం, సత్యం నీకు ముందుగా నడుస్తాయి.
15 ఆనంద ధ్వనులు తెలుసుకొన్న ప్రజలు
ధన్యజీవులు.
యెహోవా, నీ ముఖకాంతిలో వారు
మసులుకుంటారు.
16 నీ పేరునుబట్టి వారు రోజంతా ఆనందిస్తారు.
నీ న్యాయం మూలంగా వారు ఉన్నత స్థితికి వస్తారు.
17 వారి బలానికి ఘనత నీవే.
నీ దయ చేత మా కొమ్ము పైకి వచ్చింది.
18 మా డాలు యెహోవాకు చెంది ఉన్నది.
మా రాజు ఇస్రాయేల్‌ప్రజల పవిత్ర దేవునికి
చెందినవాడు.
19 ఒకప్పుడు నీ భక్తుడికి దర్శనంలో ఇలా అన్నావు:
“నేను వీరునికి సహాయం చేశాను.
అతణ్ణి ప్రజల్లోనుంచి ఎన్నుకొని హెచ్చించాను.
20 నా సేవకుడైన దావీదును కనుగొన్నాను.
నా పవిత్ర తైలంతో అతణ్ణి అభిషేకించాను.
21 అతనికి నా చేయి ఎల్లప్పుడూ అండదండ.
నా హస్తం అతణ్ణి బలపరుస్తుంది.
22 శత్రువు అతణ్ణి మోసగించలేడు.
పాపాత్ములు అతణ్ణి గెలవరు.
23 అతని ఎదుటే అతని పగవాళ్ళను పడగొట్టివేస్తాను.
అతణ్ణి ద్వేషించేవాళ్ళను కొడతాను.
24 నా విశ్వసనీయత నా కృప అతనికి తోడునీడ.
నా పేర అతని కొమ్ము పైకి వస్తుంది.
25 అతడు సముద్రంమీద చేయి ఎత్తేలా చేస్తాను.
నదులమీద అతని కుడి చేయి ఎత్తేలా చేస్తాను.
26 అతడు నాకిలా ప్రార్థన చేస్తాడు:
‘నీవు నా తండ్రివి, నా దేవుడివి,
నాకు రక్షణ ఆధార శిల.’
27 నేను అతణ్ణి నా పెద్ద కొడుకుగా చేసుకొంటాను.
అతనికి భూరాజులందరికంటే ఉన్నత స్థితిని
ప్రసాదిస్తాను.
28 నా కృప ఎప్పటికీ అతని పట్ల ఉండేలా చూస్తాను.
నా ఒడంబడిక ఎల్లప్పుడూ అతనితో
నిలిచి ఉంటుంది.
29 అతని సంతానం శాశ్వతంగా ఉండేలా చేస్తాను.
అతని సింహాసనాన్ని ఆకాశం ఉన్నంతవరకూ
నిలుపుతాను.
30 అతని సంతతివారు నా ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తే,
నా న్యాయ నిర్ణయాలను జవదాటితే,
31 నా చట్టాలను మీరితే, నా ఆజ్ఞలను పాటించకపోతే,
32 వారి తిరుగుబాటుకు వారిని బెత్తంతో శిక్షిస్తాను.
వారి అక్రమానికి దెబ్బలు తప్పవు.
33 కాని, అతనిపట్ల నా కృపను తెగతెంపులు
చెయ్యను. ఆడి తప్పను.
నా విశ్వసనీయతను వమ్ము చేయను.
34 నా ఒడంబడికను నేను మీరను.
నా పెదవుల మీది మాటను నేను మార్చను.
35 నా పవిత్ర శీలం మీద ప్రమాణం చేశాను.
దావీదుకు ఇచ్చిన మాటను తప్పను.
36 దావీదు సంతానం శాశ్వతంగా ఉంటుంది.
సూర్యమండలం ఉన్నంత కాలం అతని
సింహాసనం నా ఎదుట ఉంటుంది.
37 చంద్రగోళం ఉన్నంత కాలం అది ఎప్పటికీ
నిలిచి ఉంటుంది.
ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా
ఉంది.” (సెలా)
38 అయినా నీవు మమ్మల్ని విడిచిపుచ్చావు.
తోసిపుచ్చావు.
నీ అభిషిక్తుడిమీద నీ తీవ్ర కోపం రగులుకొంది.
39 నీ సేవకుడి ఒడంబడికను నీవు దులిపి పారేశావు.
అతడి కిరీటాన్ని నేలపై పడవేసి కాలరాచావు.
40 అతడి కంచెలన్నీ నీవు విరగ్గొట్టావు.
అతడి స్థావరాలను పాడు చేసి విడిచావు.
41 దారిన పొయ్యే వాళ్లంతా అతణ్ణి దోచుకుంటున్నారు.
ఇరుగు పొరుగు వాళ్ళకు అతడు నిందపాలయ్యాడు.
42 అతణ్ణి హింసించేవాళ్ళకు కుడిచెయ్యి పైన
ఉండేలా చేశావు.
అతడి శత్రువులకు ఆనందం కలిగించావు.
43 అతడి ఖడ్గాన్ని తొలగించావు.
యుద్ధరంగంలో అతణ్ణి నిలువనిచ్చావు కావు.
44 అతని వైభవం మాసిపొయ్యేలా చేశావు.
అతడి సింహాసనాన్ని నేలమట్టం చేశావు.
45 అతడి యువప్రాయాన్ని కుదించావు.
సిగ్గు అతణ్ణి ఆవరించేలా చేశావు. (సెలా)
46 యెహోవా, ఎంత కాలం ఇలా
కనబడకుండా ఉంటావు?
దీనికి అంతం లేదా? ఎంతకాలమని నీ తీవ్ర
కోపం మంటల్లాగా మండుతూ ఉంటుంది?
47 నా ఆయుష్షు ఎంత కొద్ది కాలమో తలచుకో.
నీవు మనుషులందరినీ ఎందుకిలా ఊరికే
సృజించావు?
48 చావును చూడకుండా బ్రతికే మనిషి అంటూ
ఉంటాడా?
మృత్యు లోకం నుంచి తప్పించుకోగల వాడెవడు?
49 నీ విశ్వసనీయత విషయంలో దావీదుతో
ప్రమాణం చేసి చెప్పావే ప్రభూ,
మొదట చూపిన ఆ అనుగ్రహం ఏదీ ఎక్కడుంది?
50 ప్రభూ! నీ సేవకులమీదికి వచ్చిన నిందను
తలచుకో!
బలంగల జనాలన్నిటిమూలంగా వచ్చిన నిందను
నా గుండెలో మోసుకొంటున్నాను.
51 యెహోవా! అవి నీ శత్రువులు మోపిన నిందలు.
నీ అభిషిక్తుడి అడుగుల మీద వాళ్ళు మోపిన
నిందలు.
52 యెహోవాకు శాశ్వతంగా స్తుతి కలుగుతుంది గాక!
తథాస్తు! తథాస్తు!