గాయకుల నాయకుడికి. రాగం: బాధ అనుభవించడం. కోరహు సంతతివారి కీర్తన. ఒక పాట. ఎజ్రా వంశంవాడైన హేమాను దైవధ్యానం.
88
1 ✽✽యెహోవా! నా ముక్తిదాతవైన దేవా!పగటివేళా, రాత్రిపూటా నేను నీ సన్నిధానంలో
సహాయంకోసం ఆక్రందన చేస్తున్నాను.
2 ✝నా ప్రార్థన అంగీకరించు.
నా మొర చెవినిబెట్టు.
3 ✽నేను కష్టాలతో నిండిపోయి ఉన్నాను.
నా ప్రాణం మృత్యు లోకానికి దరిదాపుగా చేరింది.
4 సమాధిలోకి దిగిపోయేవారి లెక్కలో చేరాను.
బలం పూర్తిగా హరించుకుపోయిన మనిషిలాగా
ఉన్నాను.
5 చచ్చినవాళ్లమధ్య విడవబడ్డాను.
హతమై సమాధిలో పడి ఉన్న వాళ్ళలాగా ఉన్నాను.
నీవు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోనివారిలాగా,
నీ చేతుల్లో నుండి తెగతెంపులైపోయిన వారిలాగా
అయ్యాను.
6 నీవు లోతైన గుంటలో నన్ను పెట్టావు.
చీకటి స్థలాలలో, అగాధాలలో నన్ను ఉంచావు.
7 ✽నీ తీవ్ర కోపం నా మీద భారంగా ఉంది.
నీ అలలను నా మీదుగా రానిస్తున్నావు. (సెలా)
8 ✽నా మిత్రులను నాకు దూరం చేశావు.
వాళ్ళ దృష్టిలో నేను నీచుణ్ణి అయ్యేలా చేశావు.
నేను బందీగా ఉన్నాను.
బయటికి రావడం అసాధ్యం.
9 ✝బాధకారణంగా నా కన్ను చివికిపోయింది.
యెహోవా, ప్రతి రోజూ నేను నీకు
మొరపెట్టి ఉన్నాను.
నీ వైపు చేతులెత్తి చాపి ఉన్నాను.
10 ✽చచ్చినవాళ్ళ కోసం నీవు అద్భుతాలు చేస్తావా?
వాళ్ళ ఆత్మలు లేచి నిన్ను కీర్తిస్తాయా? (సెలా)
11 నీ అనుగ్రహం గురించి సమాధులలో
ఉన్నవారు చెప్పుకొంటారా?
నాశన స్థలంలో నీ విశ్వసనీయతను తెలుపుతారా?
12 నీ అద్భుతాలు అంధకారంలో వెల్లడి అవుతాయా?
మరుభూమిలో నీ న్యాయం తెలుస్తుందా?
13 ✝యెహోవా, నేను సహాయంకోసం నిన్నే
ప్రాధేయపడ్డాను.
తెల్లవారగానే నా ప్రార్థన నీ సన్నిధానం చేరుతుంది.
14 ✝యెహోవా, ఎందుకు నన్ను వదిలివేస్తున్నావు?
నీ ముఖం నాకు కనబడకుండా చేస్తున్నావెందుకని?
15 ✽చిన్నప్పటినుంచీ నేను బాధితుణ్ణి.
ఎప్పుడూ చావడానికి సంసిద్ధుణ్ణే.
నీ వల్ల కలిగిన భయాందోళన నేను అనుభవించాను.
నేను కేవలం కలవరపడ్డవాణ్ణి.
16 నా మీదుగా నీ తీవ్ర కోపం వచ్చింది.
నీ వల్ల కలిగిన భయోద్రేకాలు నన్ను చంపివేశాయి.
17 రోజంతా నీళ్ళలాగా అవి నన్ను కమ్మాయి.
అవి నన్ను చుట్టుకొని ఉన్నాయి.
18 ✽నా ఆప్తులనూ, మిత్రులనూ నీవు
నాకు దూరం చేశావు.
అంధకారమే నా స్నేహితులు.