దావీదు ప్రార్థన
86
1 యెహోవా, నేను దీనావస్థలో, అక్కరలో ఉన్నాను.
గనుక నా మనవి చెవిని బెట్టి జవాబివ్వు.
2 నేను నీ భక్తుణ్ణి. నా ప్రాణం దక్కించు.
నా దేవా, నీ మీద నాకు నమ్మకం ఉంది.
నీ సేవకుడైన నన్ను రక్షించు.
3 ప్రభూ, రోజంతా నీకు మొర పెట్టుకొంటున్నాను.
నన్ను దయ చూడు.
4 నా మనసు నీ దిక్కుకు పైకి ఎగిసిపోయేలా
చేస్తున్నాను.
నీ సేవకుడైన నాకు మానసికానందం కలిగించు.
5 ప్రభూ, దయామయుడివి.
నీవు క్షమించడానికి ఎప్పుడూ సిద్దమే,
నీకు మొరపెట్టేవారందరి మీదా నీ కృప అధికం.
6 యెహోవా, నా ప్రార్థన చెవిని బెట్టు.
నా విన్నపాలు ఆలకించు.
7 నీవు నాకు జవాబిస్తావు.
కాబట్టి, నా కష్టాలలో నేను నీకు
మొరపెట్టుకుంటున్నాను.
8 ప్రభూ, నీవు గొప్పవాడివి, అద్భుతాలు చేసేవాడివి.
నీవు ఒక్కడివే దేవుడవు.
9 ప్రభూ, దేవుళ్ళనబడ్డ వాళ్ళలో నీలాంటివాడు లేడు.
నీవు చేసే పనులు సాటిలేనివి.
10 ఇతర జనాలంతా కూడా నీ సృష్టే.
అవన్నీ వచ్చి నీ సన్నిధానంలో నీకు సాష్టాంగ
నమస్కారాలు చేస్తాయి.
నీ పేరుకు ఘనత కలిగిస్తాయి.
11 యెహోవా, నీ మార్గం నాకు ఉపదేశించు.
నేను నీ సత్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తాను.
నీ పేరట నాకు భయభక్తులు అలవడే లా
నా హృదయానికి ఒకే ఒక ఉద్దేశం
కలిగించు.
12 ప్రభూ, నా దేవా, నేను హృదయపూర్వకంగా
నీకు కృతజ్ఞత అర్పిస్తాను.
నీ పేరుకు నిత్యమూ ఘనత కలిగిస్తాను.
13 నా పట్ల నీవు చూపిన అనుగ్రహం గొప్పది.
మృత్యులోకంలోని లోతైన స్థలంనుంచి
నా ప్రాణం తప్పించావు.
14 దేవా, గర్విష్ఠులు నామీదికి ఎగబడ్డారు.
దౌర్జన్యపరులు గుమికూడి నా ప్రాణం
తీయాలని ఉన్నారు.
వాళ్ళకు నీవంటే లెక్కేలేదు.
15 ప్రభూ! నీవు వాత్సల్యమయుడవైన దేవుడివి.
దయామయుడివి. సహనశీలుడివి.
కృపాసత్య సంపూర్ణుడివి.
16 నా వైపు తిరుగు. నన్ను దయ చూడు.
నీ సేవకుడైన నాకు నీ బలం ప్రసాదించు.
నీ దాసురాలి కొడుకైన నన్ను రక్షించు.
17 యెహోవా, నీవు నాకు సహాయం చేసి నన్ను
ఆదరించడం చూచి నా పగవాళ్ళు సిగ్గుపడాలి.
గనుక శుభప్రదమైన సూచన ఒకటి నాకు చూపు.