గాయకుల నాయకుడికి, గిత్తీత్‌కోసం కోరహు సంతతివారి కీర్తన.
84
1 ✽✽సేనల ప్రభువైన యెహోవా!నీ నివాస స్థలాలు ఎంత ప్రియమైనవి!
2 యెహోవా ఆవరణాల సందర్శనం కోసం
నా అంతరంగం ఎంతో ఆశిస్తూ ఉంది,
తహతహలాడుతూ ఉంది.
సజీవ దేవుని దర్శనార్థం నా హృదయం,
నా శరీరం ఆనంద ధ్వనులు చేస్తున్నాయి.
3 సేనలప్రభువైన✽ యెహోవా, నా రాజా, నా దేవా,
నీ బలిపీఠం దగ్గరే పిచ్చుకలకు
నివాసం దొరికింది.
పిల్లలు పెట్టడానికి వానకోవెల అక్కడే గూడు
కట్టుకోగలిగింది.
4 నీ ఆలయంలో నివాసం చేసేవారు ధన్యజీవులు.
వారు ఎప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఉంటారు. (సెలా)
5 ఎవరి బలం✽ నీలోనే ఉందో,
ఎవరి హృదయంలో యాత్ర✽ మార్గాలు ఉన్నాయో
వారు ధన్యులు.
6 ✽వారు బాఖా లోయలోగుండా సాగిపోతూ ఉంటే,
దానిని ఊటగా మారుస్తారు.
తొలకరి వర్షం ఆ స్థలాన్ని ఆశీస్సులతో
ఆవరించివేస్తుంది.
7 ✽వారి బలం ఎక్కువ అవుతూ ఉంది,
వారి ప్రయాణం కొనసాగుతుంది.
ప్రతి ఒక్కరూ సీయోనులో దేవుని సమక్షంలో కనబడతారు✽.
8 యెహోవా, సేనల ప్రభువైన దేవా,
నా ప్రార్థన విను✽.
యాకోబు యొక్క దేవా✽, ఇది నీ చెవిని
పడనియ్యి. (సెలా)
9 దేవా, మాకు డాలు✽లాంటివాడివి నీవు.
మా వైపు చూడు.
నీ అభిషిక్తుడి ముఖం చూడు.
10 ✽నీ ఆవరణాలలో గడిపిన ఒక్క రోజు
వెయ్యి రోజులకంటే మేలైనది.
దుర్మార్గుల నివాసాలలో కాపురముండడం కంటే
నా దేవుని ఆలయద్వారం దగ్గర నిలబడి
ఉండడం నాకిష్టం.
11 యెహోవా దేవుడు మాకు సూర్యప్రకాశం✽
లాంటివాడు, డాలులాంటివాడు.
కృపనూ✽, ఘనత✽నూ యెహోవా ప్రసాదిస్తాడు.
యథార్థ ప్రవర్తన గల వారికి ప్రతి మేలూ✽
అనుగ్రహిస్తాడు.
12 ✽సేనల ప్రభువైన యెహోవా,
నీమీద నమ్మకం ఉన్నవారే ధన్యజీవులు.