ఆసాపు కీర్తన. ఒక పాట.
83
1 దేవా, నీవు మౌనం వహించకు!
నిశ్శబ్దంగా ఉండబోకు! ఊరుకోబోకు, దేవా!
2 ఇరుగో నీ శత్రువులు ఘోషిస్తున్నారు.
నిన్ను ద్వేషించే వాళ్ళు రెచ్చిపోతున్నారు.
3 నీ ప్రజలమీద వాళ్ళు కుట్రలు
పన్నుతున్నారు.
నీలో దాక్కొన్నవారిని గురించి వాళ్ళు
దురాలోచన చేస్తున్నారు.
4 వాళ్ళిలా చెప్పుకొంటున్నారు:
“ఇస్రాయేల్ అనే పేరు కూడా ఇక నుంచి
జ్ఞప్తికి రాకుండా చేద్దాం.
వాళ్ళ జాతిని నిర్మూలం చేసేద్దాం పట్టండి.”
5 వాళ్ళు ఏకగ్రీవంగా సమాలోచన చేశారు.
నీకు వ్యతిరేకంగా సంధి చేసుకొన్నారు.
6 వాళ్ళు ఎదోం దేశ నివాసులూ,
ఇష్మాయేల్‌జాతి వాళ్ళూ,
మోయాబ్‌దేశం వాళ్ళూ,
హగ్రీ జాతి వాళ్ళూ,
7 గెబల్‌జాతి వాళ్ళూ, అమ్మోన్‌దేశం వాళ్ళూ,
అమాలేక్‌జాతి వాళ్ళూ, ఫిలిష్తీయ దేశస్థులూ,
తూరు నివాసులూ.
8 అష్షూరు దేశం వాళ్ళ పక్షాన చేరింది.
లోత్ వంశీకులకు చేయూత ఇస్తున్నారు. (సెలా)
9 నీవు మిద్యానువాళ్ళను ఏమి చేశావో,
కీషోన్‌ఏటి రేవున సీసెరానూ యాబీన్‌నూ
ఏమి చేశావో అదే వీళ్ళనూ చెయ్యి.
10 వాళ్ళు ఎన్‌దోరు దగ్గర నాశనమైపొయ్యారు.
భూమికి పెంట అయ్యారు.
11 ఓరేబ్, జెయేబ్‌నాయకులకు నీమూలంగా
సంభవించినదంతా వీళ్ళ సామంతులకు
జరిగేలా చెయ్యి!
జెబహు, సల్‌మున్నాలకు సంభవించినదంతా
వీళ్ళ అధిపతులకు కూడా జరిగేలా చెయ్యి!
12 “దేవుడి నివాసాలు మనం ఆక్రమించుకుందాం”
అని వాళ్ళు చెప్పుకొంటున్నారు.
13 నా దేవా, వాళ్ళను సుడి తిరిగే దుమ్ము లాగా,
గాలి చేత కొట్టుకుపొయ్యే పొట్టులాగా చెయ్యి.
14 అగ్ని అడవిని కాల్చివేసినట్టు,
కారు చిచ్చు కొండలను తగలబెట్టినట్టు
15 నీ తుఫానుతో వాళ్ళను పారదోలు!
నీ సుడి గాలి చేత వాళ్ళకు భయం కలిగించు!
16 యెహోవా, మనుషులు నిన్ను వెదికేలా వాళ్ళ
ముఖాలను పూర్తిగా సిగ్గుపాలు చేయి!
17 వాళ్ళు నిత్యమైన అవమానం, భయం
అనుభవించాలి, ఆశాభంగం పొంది
నాశనం కావాలి.
18 యెహోవా అనే పేరుగల నీవు మాత్రమే
లోకమంతట్లో సర్వాతీతుడైన దేవుడని
వారు తెలుసుకొంటారు గాక!