ఆసాపు కీర్తన
82
1 దేవుడు బలాఢ్యుల సమాజంలో నిలబడి ఉన్నాడు.
ఆయన దేవుళ్ళ మధ్య తీర్పు తీర్చేవాడు.
2 “ఎన్నాళ్ళు మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు?
దుర్మార్గులంటే మీకెంతవరకు ఈ పక్షపాతం?
3 బీదసాదలకు, అనాథలకు న్యాయం చేకూర్చండి.
దీనదశలో, అక్కరలో ఉన్నవారికి న్యాయం
జరిగేలా చూడండి.
4 బీదవారికీ, దరిద్రులకు విడుదల కలిగించండి.
దుర్మార్గుల చేతిలోనుంచి వారిని తప్పించండి.
5 వాళ్ళకు తెలివి లేదు.
వాళ్ళకేమీ అర్థం కాదు.
వాళ్ళు చీకట్లో అటు ఇటు తిరుగులాడుతారు.
లోకం పునాదులన్నీ కంపించి ఉన్నాయి.
6 మీరు “దేవుళ్ళు” అనీ,
మీరంతా సర్వాతీతుడి కుమారులనీ
నేను గదా చెప్పాను?
7 అయినా, ఇతరుల్లాగే మీరూ చనిపోతారు.
ఇతర అధికారులు కుప్పకూలినట్లే మీకూ
జరుగుతుంది.
8 దేవా, లేచి భూమికి తీర్పు తీర్చు.
జనాలన్నీ నీ సొత్తు.