గాయకుల నాయకుడికి. గిత్తీత్‌కోసం. ఆసాపు కీర్తన.
81
1 దేవుడే మనకు బలం.
ఆయనకు సంతోషంతో పాడండి.
యాకోబుయొక్క దేవుణ్ణి ఉద్దేశించి
ఆనంద ధ్వనులు చేయండి.
2 సంకీర్తనం చేయండి.
కంజరి మోగించండి.
చెవికి ఇంపైన తంతివాద్యాలు వాయించండి.
3 అమావాస్య, పౌర్ణమి పండుగ రోజున
మన సమయంలో పొట్టేలుకొమ్ము బూర
ఊదండి.
4 ఇది ఇస్రాయేల్‌ప్రజలకు చట్టం.
యాకోబుయొక్క దేవుడు ఇచ్చిన నిర్ణయం.
5 ఆయన ఈజిప్ట్‌దేశసంచారం చేసినప్పుడు
యోసేపు సంతతికి దీనిని శాసనంగా
నెలకొల్పాడు.
నేను గుర్తించని స్వరం ఇలా చెప్పడం విన్నాను:
6 “వారి భుజాలనుంచి నేను బరువు దించాను.
వారి చేతులు గంపలెత్తుకొని మోయకుండా
విడుదల పొందాయి.
7 కష్టదశలో మొరపెట్టావు నీవు.
నేను నిన్ను విడిపించాను.
ఉరుములు దాగి ఉన్న చోటునుంచి
నీకు నేను జవాబు చెప్పాను.
మెరీబా నీళ్ళ దగ్గర నిన్ను పరీక్షకు
గురి చేశాను. (సెలా)
8 నా ప్రజలారా, ఆలకించండి.
నేను మీకు ఒక సంగతి తెలియజేస్తాను.
అయ్యో, ఇస్రాయేల్, నీవు నా మాట
విని ఉంటే ఎంత బావుండేది!
9 ఇతర దేవుళ్ళు మీమధ్య ఉండడానికి వీల్లేదు.
వేరే దేవుణ్ణి మీరు పూజించకూడదు.
10 నేనే మీ దేవుణ్ణి, యెహోవాను.
ఈజిప్ట్‌నుంచి మిమ్మల్ని తెచ్చినది నేనే.
నీ నోరు బాగా తెరువు. దానిని నింపుతాను.
11 అయినా నా ప్రజలు నా మాట వినలేదు.
ఇస్రాయేల్‌ప్రజలు నాకు విధేయులు కాలేదు.
12 గనుక వారిని తమ సొంత ఉద్దేశాలను
అనుసరించనిచ్చాను.
వారి హృదయ కాఠిన్యానికి వారిని అప్పగించాను.
13 అయ్యో, నా ప్రజలు నా మాట వింటే
ఎంత బాగుండేది!
ఇస్రాయేల్ నా విధానాలను అనుసరిస్తే ఎంత
బాగుండేది!
14 అప్పుడు నేను వారి శత్రువులను త్వరలో
అణచివేసేవాణ్ణి.
వారి పగవాళ్ళను నేను దండించేవాణ్ణి.
15 యెహోవాను ద్వేషించేవాళ్ళు నాకు విధేయత
నటిస్తారు.
వాళ్ళకు నిత్య నాశనం తప్పదు.
16 మంచి గోధుమలతో నేను నా ప్రజలను పోషిస్తాను.
కొండ తేనెతో నీకు తృప్తి చేకూరుస్తాను.”