గాయకుల నాయకుడికి. రాగం: ఒడంబడిక కలువలు. ఆసాపు కీర్తన.
80
1 ✽ఇస్రాయేల్‌ప్రజల కాపరీ✽,నా మనవిని చెవినిబెట్టు.
మందలాగా యోసేపువంశానికి దారి చూపేవాడా,
కెరూబులకూ✽ పైగా సింహాసనాసీనుడా,
నీ ప్రకాశం కనుపరుచు.
2 ✽ఎఫ్రాయిం, బెన్యామీన్, మనష్షే గోత్రాల
ఎదుట నీ బల ప్రభావాలను ప్రదర్శించు.
మమ్మల్ని రక్షించడానికి వేంచేయి.
3 దేవా, మమ్మల్ని చెరలోనుంచి రప్పించు✽.
మాకు విడుదల లభించేలా నీ ముఖకాంతి రేఖలు
ప్రసరించనియ్యి✽.
4 ✽యెహోవా, సేనల ప్రభువైన దేవా,
నీ ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే
నీవెంతకాలం కోపపడుతావు?
5 ✽వారికి వారి కన్నీళ్ళే ఆహారమయ్యేలా చేశావు.
వారు పెద్ద మోతాదులో కన్నీళ్ళు తాగేలా చేశావు.
6 మా పొరుగువాళ్ళను మా గురించి పోరాడేలా
చేస్తున్నావు.
మా శత్రువులు మమ్మల్ని గేలి చేస్తూ ఉన్నారు.
7 సేనల ప్రభూ, దేవా, మమ్మల్ని చెరలోనుంచి
రప్పించు.
మాకు విడుదల లభించేలా నీ ముఖకాంతి రేఖలు
మా పై ప్రసరించనియ్యి.
8 ✽నీవు ఈజిప్ట్‌నుంచి ఓ ద్రాక్షచెట్టును తెచ్చావు.
ఇతర ప్రజలను తొలగించి✽ దానిని నాటావు.
9 దానికి నేల సిద్ధం చేశావు.
లోతుగా వేరూని అది దేశమంతా వ్యాపించింది.
10 దాని నీడ కొండలను ఆవరించింది.
దాని తీగెలు దేవుని దేవదారు చెట్లను కమ్మాయి.
11 ✽దాని తీగెలు సముద్రందాకా,
దాని రెమ్మలు యూఫ్రటీసు నదివరకు
ప్రాకిపోయాయి.
12 దారిన పొయ్యేవాళ్ళంతా దాని తీగెలు తెంచివేసేలా
దాని కంచె✽లను నీవెందుకు పడగొట్టావు?
13 ✽అడవిపంది దానిని మేసివేస్తూ ఉంది.
పొలంలోని గొడ్డు గోదా దానిని తినివేస్తూ
ఉన్నాయి.
14 ✽సేనలప్రభూ! దేవా! మళ్ళీ రా!
పరలోకంనుంచి ఒకసారి ఇటు చూడు!
ఈ ద్రాక్షచెట్టును సందర్శించు!
15 నీవు నీ కుడి చేతితో నాటినదానిని కాపాడు!
నీకోసం నీవు పెంచిన చెట్టును కాపాడు!
16 దానిని కాల్చడం, నరికివేయడం జరిగింది.
నీ ముఖంమీది కోప రేఖలు వాళ్ళను నాశనం
చేస్తున్నాయి.
17 ✽నీ కుడిచేతి మనిషిమీద నీ చేయి ఉంచు.
నీవు బలపరచిన మానవ పుత్రునిమీద
నీ చేయి ఉంచు.
18 అలాగైతే మేము నీ దగ్గర నుంచి వెనక్కు పోము.✽
మమ్మల్ని బ్రతికించు✽. అప్పుడు నీ పేరటే
ప్రార్థన చేస్తాం.
19 యెహోవా, సేనల ప్రభువైన దేవా,
మమ్మల్ని చెరలోనుంచి రప్పించు.
మాకు విడుదల లభించేలా నీ ముఖ కాంతి
రేఖలు మాపై ప్రసరించనియ్యి.