ఆసాపు కీర్తన
79
1 దేవా, ఇతర ప్రజలు నీ సొత్తులోకి చొరబడ్డారు.
వాళ్ళు నీ పవిత్రాలయాన్ని అశుద్ధం చేశారు.
జెరుసలంను రాళ్ళగుట్టగా మార్చివేశారు.
2 నీ సేవకుల శవాలను గాలిలో ఎగిరే పక్షులకూ,
నీ భక్తుల మృత దేహాలను భూమి పై తిరుగాడే
మృగాలకూ ఆహారంగా పడవేశారు.
3 నీళ్ళులాగా వారి రక్తాన్ని జెరుసలం చుట్టు
పారబోశారు.
వారిని పూడ్చిపెట్టేవాడెవడూ లేడు.
4 మా ఇరుగుపొరుగువాళ్ళ దృష్టిలో మేము
నీచులమయ్యాం.
మా చుట్టు ప్రక్కల వాళ్ళు మమ్మల్ని చూచి
వెక్కిరిస్తారు, ఎగతాళి చేస్తారు.
5 యెహోవా, ఎన్నాళ్ళు నీకు మామీద కోపం?
శాశ్వతంగా ఉంటుందా?
నీ రోషం మంటల్లాగా మండుతూనే ఉంటుందా?
6 నిన్నెరుగని జనాల పై నీ కోపం కుమ్మరించు,
నీ పేరట ప్రార్థించని రాజ్యాలమీద నీ ఆగ్రహం
కుమ్మరించు.
7 వాళ్ళు యాకోబుప్రజలను దిగమింగారు.
వారి నివాస స్థానాన్ని పాడుచేశారు.
8 మా పూర్వీకుల అపరాధాలు జ్ఞాపకముంచుకొని,
మామీద వ్యతిరేక భావం పెట్టుకోకు.
శీఘ్రంగా నీ వాత్సల్యం మామీదికి రానివ్వు.
మేము ఎంతో నీరసించి ఉన్నాం.
9 దేవా, మా రక్షకా,
నీ పేరు ప్రతిష్ఠల దృష్ట్యా మాకు సాయం చెయ్యి.
నీ పేరుకోసం మమ్మల్ని విడిపించు.
మా పాపాలను తుడిచివెయ్యి.
10 “వాళ్ళ దేవుడు ఏడి ఎక్కడున్నాడు?”
అని ఇతర ప్రజలు ఎందుకు పలకాలి?
వాళ్లు ఒలికించిన నీ సేవకుల రక్తం విషయం
నీవు ప్రతీకారం జరిగిస్తావని
వాళ్ళకు తెలియాలి.
మేము అది స్వయంగా చూడాలి.
11 ఖైదీల నిట్టూర్పులు నీ దగ్గరికి రానియ్యి.
నీ మహా హస్తబలం చొప్పున చావనై ఉన్నవారిని
కాపాడు.
12 ప్రభూ! మా పొరుగువాళ్ళు నిన్ను దూషించారు.
వాళ్ళకు ప్రతీకారం చెయ్యి.
వాళ్ళను ఏడంతల దూషణకు గురి చెయ్యి.
13 అప్పుడు మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాం.
మేము నీ ప్రజలం, నీ మంద గొర్రెలం.
తరతరాలకూ నీ కీర్తి ప్రచురిస్తాం.