ఆసాపు రాసిన దైవధ్యానం
78
1 నా ప్రజలారా, నా ఉపదేశం చెవిని పెట్టండి.
నా నోటినుంచి వెలువడే మాటలు చెవియొగ్గి
వినండి.
2 నోరార నేను కావ్యం చెపుతాను.
పురాతన కాలంనుంచి వచ్చిన గూఢ సత్యాలు
వినిపిస్తాను.
3 ఈ సంగతులు మేము విన్నాం, తెలుసుకొన్నాం.
మా పూర్వీకులు మాకు తెలియజేశారు.
4 ఈ విషయాలు వారి పిల్లలకు చెప్పకుండా
దాచము.
రాబోయే తరానికి యెహోవా సంస్తుతులను
ఆయన బలప్రభావాలను,
ఆయన చేసిన అద్భుత కార్యాలను చెపుతాను.
5 ఆయన యాకోబువంశంలో ఓ సాక్ష్యం
నిలిపాడు,
ఇస్రాయేల్‌కు ఓ ఉపదేశం ప్రసాదించాడు.
వీటిని మన పూర్వీకులు తమ
పిల్లలకు అందించాలని ఆయన ఆజ్ఞాపించాడు.
6 ఆయన ఉద్దేశమేమిటంటే, మరుసటి తరంలో
పుట్టబోయే పిల్లలు ఇదంతా తెలుసుకొని,
తిరిగి తమ పిల్లలకు ఇదంతా
చెప్పుకోవడానికి పూనుకోవాలి;
7 వీళ్ళంతా దేవునిమీద నమ్మకం ఉంచాలి;
దేవుని క్రియలను మరువకుండా ఆయన
ఆజ్ఞలు పాటించాలి;
8 వీళ్ళు తమ పూర్వీకులలాంటివారు కాకూడదు
అన్నమాట.
ఆ తరంవాళ్ళు మొండికెత్తి, దేవునికి
తిరుగుబాటు చేసినవాళ్ళు.
తమ హృదయాలను సరి చేసుకొన్నవాళ్ళు కాదు.
వాళ్ళు దేవుని విషయం అంతరంగంలో
నమ్మకమైనవాళ్ళు కాదు.
9 ఎఫ్రాయిం గోత్రంవాళ్ళు యుద్ధాయుధాలను
ధరించి కూడా తీరా యుద్ధ సమయం
వచ్చేటప్పటికి వెనక్కు తిరిగారు.
10 వాళ్ళు దేవుని ఒడంబడిక ప్రకారం
ప్రవర్తించలేదు.
ఆయన ధర్మశాస్త్రం అనుసరించడానికి
వాళ్ళు ఇష్టపడలేదు.
11 ఆయన క్రియలను, వారికి చూపిన ఆయన
అద్భుతాలను వాళ్ళు మరిచిపోయారు.
12 వాళ్ళ పూర్వీకులు చూస్తూ ఉండగానే ఈజిప్ట్‌
దేశంలో, సోయన్‌నగర ప్రదేశంలో
ఆయన వింతలు చేశాడు.
13 ఆయన సముద్రాన్ని రెండుగా విభజించాడు.
అందులో గుండా వాళ్ళను దాటించాడు,
నీళ్ళను సమకూర్చి, ఓ కుప్పలాగా నిలిపాడు.
14 పగలు తన మేఘంతో, రాత్రి అంతా మంటల
వెలుగుతో ఆయన వారికి వెళ్ళవలసిన దారి
చూపాడు.
15 ఎడారిలో ఆయన బండలను చీల్చాడు.
జలాగాధంలాగా సమృద్ధిగా వారికి త్రాగడానికి
నీళ్ళు అనుగ్రహించాడు.
16 బండలో నుంచి నీటి ప్రవాహాలు వచ్చేలా చేశాడు.
నదులలాగా నీళ్ళు పారేలా చేశాడు.
17 అయినా వాళ్ళు ఆయనకు విరోధంగా పాపాలు
చేస్తూనే వచ్చారు.
సర్వాతీతుని మీద ఎడారిలో
తిరుగుబాటు చేస్తూనే వచ్చారు.
18 శరీర తృప్తికి ఆహారం కావాలని ఆయనను
అడిగారు.
ఈ విధంగా వీళ్ళు తమ హృదయంలో దేవుణ్ణి
పరీక్షకు గురి చేశారు.
19 దేవుణ్ణి ఎదిరించి ఇలా మాట్లాడుకొన్నారు:
“ఎడారిలో దేవుడు మనకు భోజనం పెట్టగలడా?
20 ఆయన బండను కొట్టగా దానిలో నుంచి నీళ్ళు
పెల్లుబికి వచ్చాయి.
నీరు ప్రవాహమై పారింది.
అయితే ఆయన మనకు రొట్టెలు పెట్టగలడా?
తన ప్రజలకు మాంసం సరఫరా చెయ్యగలడా?”
21 ఇదంతా విని, యెహోవా కోపగించుకొన్నాడు.
యాకోబువంశానికి నిప్పంటుకొంది.
ఇస్రాయేల్‌ప్రజల మీద దేవుని కోపం
రగులుకొంది.
22 ఎందుకంటే, వాళ్ళు దేవునిమీద నమ్మకం
ఉంచినవారు కారు.
ఆయన రక్షణ ప్రసాదిస్తాడని
నమ్ముకొన్నవారు కారు.
23 అయినా, పైన ఉన్న మేఘాలకు ఆయన
ఆజ్ఞ జారీ చేశాడు.
ఆకాశ ద్వారాలను ఆయన తెరిచాడు.
24 తినడానికి వాళ్ళ మీద మన్నా కురిపించాడు.
ఆకాశంనుంచి ఆహారం వాళ్ళకు దయ చేశాడు.
25 దేవదూతల ఆహారం మనుషులు తిన్నారు.
ఆహారాన్ని వాళ్ళకు సర్వ సమృద్ధిగా దేవుడు
పంపాడు.
26 ఆకాశంలో తూర్పుగాలి వీచేలా చేశాడు.
తన బలంచేత దక్షిణం గాలి రప్పించాడు.
27 ధూళి అంత విస్తారంగా మాంసం
కురిపించాడాయన.
సముద్రం ఇసుకరేణువులా అన్నట్టు
రెక్కలున్న పక్షులను వాళ్ళపై
కుమ్మరించాడు.
28 ఈ పక్షులు వారి శిబిరంలో,
వారి డేరాలచుట్టు దిగి వచ్చేలా చేశాడు.
29 వాళ్ళంతా కడుపునిండా తిన్నారు.
వాళ్ళు ఆశించినదానిని ఇచ్చాడాయన.
30 అయినా, వారి ఆశ తీరేముందే,
ఆహారం ఇంకా వాళ్ళ నోట ఉండగానే,
31 దేవుని కోపం వాళ్ళమీదికి వచ్చింది.
వారిలో బలిసినవాళ్ళను కొందరిని ఆయన
హతమార్చాడు.
ఇస్రాయేల్‌ప్రజలలో యువకులను
అణచివేశాడు.
32 ఇంత జరిగినా,
వాళ్ళింకా పాపాలు చేస్తూనే వచ్చారు.
ఆయన చేసిన అద్భుతాలు చూచినా వాళ్ళు
ఆయనను నమ్మకుండా ఉన్నారు.
33 అందుచేత వాళ్ళ రోజులు వ్యర్థంగా
గతించిపోయేలా చేశాడు.
వాళ్ళ సంవత్సరాలు భయంతో
ముగిసిపొయ్యేలా చేశాడు.
34 దేవుడు వారిని చంపినప్పుడు ఆయనను వెదికారు.
ఆయన వైపు తిరిగి,
శ్రద్ధాసక్తులతో ఆయనను అన్వేషించారు.
35 దేవుడు తమకు ఆధారశిలలాంటివాడని
గుర్తు తెచ్చుకొన్నారు.
సర్వాతీతుడు తమ్మును కొనుక్కొని
విడిపించినవాడని జ్ఞాపకం చేసుకొన్నారు.
36 అయినా వారి హృదయం ఆయనపట్ల
నిలకడగా లేదు.
ఆయన చేసిన ఒడంబడిక విషయం
వాళ్ళు నమ్మకంగా లేరు.
37 వాళ్ళు నోటితో ఆయనకు కపటమైన
మాటలు చెప్పారు.
38  అయినా, దేవుడు వాత్సల్యమయుడు.
వారి అపరాధాన్ని కప్పివేశాడు.
వాళ్ళను నాశనం చేయలేదు.
చాలా సార్లు ఆయన కోపాగ్నిని అణచుకొన్నాడు.
తన ఆగ్రహమంతా పురికొల్పుకోలేదు.
39 వాళ్ళు శరీరులనీ, వెళ్ళి తిరిగి రాని గాలి
ఊపిరిలాంటివాళ్ళనీ ఆయనకు జ్ఞాపకమే.
40 ఎడారిలో వాళ్ళెన్నో సార్లు ఆయనమీద
తిరుగబడ్డారు.
ఆ పాడు ప్రదేశంలో ఆయనను ఎన్నో సార్లు
దుఃఖపెట్టారు.
41 చీటికీ మాటికీ వాళ్ళు దేవుణ్ణి పరీక్షించారు.
ఇస్రాయేల్‌ప్రజలు పవిత్రుడైన దేవుణ్ణి
హద్దులో పెట్టారు.
42  ఆయన బలం ఎలాంటిదో వాళ్ళు జ్ఞాపకం
చేసుకోలేదు.
శత్రువుల బారినుంచి వాళ్ళను ఆయన
విడిపించిన రోజైనా వాళ్ళకు జ్ఞాపకం
లేకపోయింది.
43 అప్పుడు ఈజిప్ట్‌లో ఆయన తన చిహ్నాలు
కనుపరచాడు.
సోయన్‌నగర ప్రాంతంలో అద్భుతాలు చేసి
చూపాడు.
ఇదీ వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు.
44 నైలు నది కాలువలు, అక్కడి ప్రవాహాలు
రక్తంగా మార్చాడు.
ఈజిప్ట్‌వాళ్ళు వాటి నీళ్ళు తాగలేకపోయారు.
45 ఆయన వాళ్ళ మీదికి ఈగల గుంపులను పంపాడు.
అవి వాళ్ళును మింగివేశాయి.
కప్పలను వదిలాడు.
అవి వాళ్ళ మీదికి నాశనం రప్పించాయి.
46 పంట చేలను పురుగులకు వదిలి పెట్టాడు.
వాళ్ళ కృషి ఫలితాన్ని మిడతలకు అప్పగించాడు.
47 వడగండ్లు కురిపించి ద్రాక్షచెట్లను పాడు చేశాడు.
చలిమంచుచేత వాళ్ళ మేడిచెట్లను నాశనం చేశాడు.
48 వాళ్ళ గొడ్లూ గోదా వడగండ్ల పాలయ్యేలా,
వాళ్ళ మందలు పిడుగుల పాలయ్యేలా చేశాడు.
49 వాళ్ళ మీదికి ఆయన తన కోపాగ్ని,
ఆగ్రహం, చిరాకు, బాధ పంపాడు.
విపత్తు కలిగించే దేవదూతల గుంపును పంపాడు.
50 తన కోపానికి దారి సరిచేశాడు.
మరణంనుంచి వాళ్ళ ప్రాణాన్ని తప్పించలేదు.
వాళ్ళను నాశనానికి అప్పగించాడు.
51 ఈజిప్ట్‌లో జ్యేష్ఠ కుమారులందరినీ,
ఆ హాము వంశంవాళ్ళ నివాసాల్లో వాళ్ళ బలంవల్ల
కలిగిన ఆ తొలి సంతానాన్ని
ఆయన హతం చేశాడు.
52 అప్పుడు గొర్రెలను నడిపించినట్టు తన
ప్రజలను ఆయన వెంటబెట్టుకుపోయాడు.
ఎడారిలో మందలాగా వాళ్ళకు దారి చూపుతూ
వెళ్ళాడు.
53 వారు భయపడకుండా క్షేమంగా వారిని
నడిపించాడు.
కాని, వారి శత్రువులను సముద్రం ముంచివేసింది.
54 పవిత్రమైన తన దేశానికి తన కుడి చేయి
సంపాదించిన ఈ కొండసీమకు
వారిని తీసుకువచ్చాడు.
55 వారి ఎదుటనుంచి ఇక్కడి జనాలను ఆయన
పారదోలాడు.
ఆ జనాల భూములను వారికి వారసత్వంగా
పంచియిచ్చాడు.
వాళ్ళ నివాస స్థలాలలో ఇస్రాయేల్‌గోత్రాలను
కాపురముండేలా చేశాడు.
56 అయినా, సర్వాతీతుణ్ణి వారు పరీక్షించారు,
ఎదిరించారు.
ఆయన శాసనాలను వారు పాటించలేదు.
57 తమ పూర్వీకులలాగే దేవునినుంచి వెనక్కు తీసి ద్రోహులయ్యారు.
ఎక్కు పెడితే సరిగ్గా వంగని విల్లులాగా వాళ్ళు
తొలగిపొయ్యారు.
58 తమ ఎత్తయిన పూజాస్థలాలచేత ఆయనకు
కోపం రేపారు.
తమ విగ్రహాల మూలంగా ఆయనకు రోషం
పురికొలిపారు.
59 దేవుడు ఇదంతా చూచి కోపపడ్డాడు.
ఇస్రాయేల్‌ప్రజలంటే, ఆయనకు ఎంతో
అసహ్యం కలిగింది.
60 అప్పుడాయన షిలోహులో ఉన్న తన
నివాసాన్ని విసర్జించాడు.
మనుషులమధ్య ఆయన వేసిన ఆ గుడారాన్ని
వదిలిపెట్టాడు.
61 తన బలాన్ని బందీగా అప్పగించివేశాడు.
తన మహిమను శత్రువుల చేతికి ఇచ్చాడు.
62 తన ప్రజలను ఖడ్గానికి గురి చేశాడు.
తన సొత్తయిన ప్రజ మీద ఆయన తన ఆగ్రహం
కుమ్మరించాడు.
63 మంటలు వాళ్ళ యువకులను మింగివేశాయి.
వాళ్ళ కన్యలకు పెళ్ళిపాటలు లేకపోయాయి.
64 వాళ్ళ యాజులు కత్తిపాలై కూలారు.
వాళ్ళ విధవరాండ్రు ఏడవలేకపోయారు.
65 అప్పుడు నిద్రలోనుంచి మేల్కొన్నట్టు
ప్రభువు లేచాడు.
మద్యం చేత మత్తిల్లి విజయ ధ్వనులు చేసే
వీరుడులాంటివాడయ్యాడు.
66 ఆయన శత్రువులను వెనక్కు తరిమికొట్టాడు.
వాళ్ళ మీదికి శాశ్వతమైన నింద రప్పించాడు.
67 ఆయన యోసేపు డేరాను చీదరించుకొన్నాడు.
ఎఫ్రాయిం గోత్రాన్ని ఆయన ఎన్ను కోలేదు.
68 ఆయన యూదగోత్రాన్ని ఎన్నుకొన్నాడు.
తనకు ప్రియమైన సీయోను కొండను ఆయన
ఎన్నుకొన్నాడు.
69 తన ఎత్తయిన నివాసం కట్టినట్టు
తన పవిత్రాలయం నిర్మించాడు.
భూమిని శాశ్వతంగా స్థాపించినట్టే దానిని
కట్టించాడు.
70 తన సేవకుడైన దావీదును ఎన్నుకొన్నాడు.
అతణ్ణి గొర్రెల దొడ్లలోనుంచి తీసుకొన్నాడు.
71 అతడి కాపుదలలో ఉన్న పాలిచ్చేగొర్రెల
దగ్గరనుంచి రప్పించి, తన ప్రజలైన
యాకోబు జనానికి కాపరిగా
ఉండడానికి, తన సొత్తుగా ఉన్న
ఆ ఇస్రాయేల్‌ప్రజలకు
కాపరిగా ఉండడానికి అతణ్ణి నియమించాడు.
72 అతడు వారికి నిజాయితీపరుడైన కాపరిగా
ఉన్నాడు.
ప్రవీణుడై వారికి మార్గదర్శిగా ఉన్నాడు.