గాయకుల నాయకుడికి. తంతివాద్యాలతో పాడతగ్గది. ఆసాపు కీర్తన. ఒక పాట.
76
1 యూదాలో దేవుడు ప్రసిద్ధుడు.
ఇస్రాయేల్‌వారికి ఆయన పేరు పూజ్యం.
2 షాలేంలో ఆయన గుడారం ఉంది.
సీయోనులో ఆయన ఆలయం ఉంది.
3 అక్కడ మండుతున్న వింటి బాణాలు విరిచివేశాడు.
డాలు, ఖడ్గం, యుద్ధం ఆయన
ఛిన్నా భిన్నం చేశాడు. (సెలా)
4 దేవా, నీవు తేజోస్వరూపివి.
అడవి మృగాలు ఉన్న పర్వతాల అందం ఎదుట
నీ శోభ ఎంతో గొప్పది.
5 ధైర్యం గల బలాఢ్యులను దోచుకోవడం జరిగింది.
వాళ్ళు కన్నుమూశారు.
ఆ వీరుల చేతులు ఏమైపొయ్యాయో
వాళ్ళకే కనబడలేదు.
6 యాకోబుయొక్క దేవా, నీవు గద్దిస్తే రౌతులకూ
గుర్రాలకూ గాఢ నిద్ర పట్టింది.
7 నీవు భయభక్తులకు పాత్రుడివి,
నీవు మాత్రమే.
నీవే గనుక కోపగిస్తే నీ ఎదుట ఎవరు
నిలువగలరు?
8 లోకానికి వినబడేలా నీవు పరలోకంనుంచి
తీర్పు చెప్పావు.
9 దేశమంతటా దీనదశలో ఉన్న తన భక్తులను రక్షించడానికి దేవుడు లేచాడు.
అప్పుడు భూమి భయంతో మౌనం
వహించింది. (సెలా)
10 దేవా, మనుషుల కోపం ఫలితంగా
నీకు స్తుతి కలుగుతుంది.
మిగతా కోపాన్ని ఆయుధంగా ధరించుకొంటావు.
11 మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని
మీ మ్రొక్కుబడులను అర్పించండి.
ఆయన చుట్టూరా ఉన్నవారందరూ
భయభక్తులకు పాత్రుడైన దేవునికి కానుకలు
తీసుకురావాలి.
12 పరిపాలకుల గర్వాన్ని ఆయన అణచివేస్తాడు.
ఆయన అంటే భూరాజులు భయపడాలి.