గాయకుల నాయకుడికి. రాగం: నాశనం చేయకు ఆసాపు కీర్తన. ఒక పాట.
75
1 దేవా, నీకు మా కృతజ్ఞతలు.
నీ పేరు మాకెంతో సన్నిహితం.
నీకు మా కృతజ్ఞతలు.
మనుషులు నీ అద్భుత క్రియలను చాటుతారు.
2 “నేను సరైన సమయం నియమించి
న్యాయంతో తీర్పు తీరుస్తాను.
3 భూమి, దానిమీద నివసించేవాళ్ళంతా
కంపించిపోయినప్పుడు దాని స్తంభాలను
నిలబెట్టేది నేనే. (సెలా)
4 బడాయికోరులకు నేను చెప్పేది ఇదే:
బడాయి చెప్పుకోకండి.
దుర్మార్గులకు నేను చెప్పేదేమంటే,
కొమ్ము ఎత్తకండి,
5 పొడవడానికి కొమ్ము పైకి ఎత్తుకోకండి.
మెడ వంగని పొగరుబోతులై మాట్లాడకండి.
6 తూర్పునుంచి గాని, పడమటినుంచి గాని,
ఎడారి వైపునుంచి గాని ఉన్నత స్థితి రాదు.
7 దేవుడే తీర్పు తీరుస్తాడు.
ఆయన ఒకరిని అణిచివేస్తాడు,
మరొకరిని పైకెత్తుతాడు.
8 యెహోవా చేతిలో పాత్ర ఒకటి ఉంది.
పాత్రలోని ద్రాక్షరసం పొంగి
నురుగులు కడుతూ ఉంది.
అది బాగా మిశ్రం చేయబడింది.
ఆయన ఆ పాత్రలోది పారబోస్తున్నాడు.
అందులోని మడ్డితో సహా భూమిమీద ఉన్న
దుర్మార్గులందరూ దానిని గుటకలేస్తూ
మ్రింగితీరాలి.
9 నేనైతే ఎల్లప్పుడు దేవుని కీర్తి ప్రకటిస్తాను.
యాకోబు యొక్క దేవుణ్ణి సంకీర్తన చేస్తాను.
10 దుర్మార్గుల అధికారమంతా అణిగి
లయమైపోతుంది.
న్యాయవంతుల అధికారం వర్ధిల్లుతుంది.