ఆసాపు కీర్తన, దైవధ్యానం
74
1  దేవా, మమ్మల్ని ఎందుకిలా ఎప్పటికీ విడిచి పెట్టావు?
నీవు మేపే గొర్రెల మందమీద నీ కోపాగ్ని
రవులుకొనేది ఎందుకు?
2 పూర్వం నీవు సంపాదించుకొన్న నీ సమాజాన్ని
తలచుకో.
అది నీ సొత్తు అయిన గోత్రంగా ఉండడానికి
దానిని విడిపించావు.
నీవు నివసించే ఈ సీయోను కొండను తలచుకో.
3 ఎప్పటికీ ఇలాగే శిథిలమై పడి ఉన్న స్థలాలకు
దగ్గరగా రా.
పవిత్రాలయంలో ప్రతి వస్తువునూ శత్రువులు
పాడు చేశారు.
4 నీ సమాజ స్థలం మధ్యలో నీ విరోధులు
గర్జించారు.
తమ జెండాలను విజయసూచకంగా పైకెత్తారు.
5 అడవిలో గుబురు చెట్ల మీద ఎవడో గొడ్డలి
ఎత్తినట్టు ఆ దృశ్యం కనిపించింది.
6 వాళ్ళు గొడ్డళ్ళను, సుత్తెలను చేతపట్టుకొని
కొయ్య పై చెక్కబడినదంతా ఎడా పెడా
విరగ్గొట్టారు.
7 నీ పవిత్రాలయానికి నిప్పు పెట్టారు.
నీ పేరు ఉన్న స్థలాన్ని నేల కూల్చి, దానిని
అపవిత్రం చేశారు.
8 “వాటిని పూర్తిగా నేలమట్టం చేద్దామ” ని
హృదయంలో ఉద్దేశించారు.
దేశంలో ఉన్న సమాజ స్థలాలన్నిటినీ
తగలబెట్టారు.
9 ఇప్పుడు మా సంకేతాలేవో
మాకు కనబడడం లేదు.
ప్రవక్త అనేవాడెవడూ లేడు.
ఎంతకాలమని ఇలా ఉంటుందో తెలిసినవాడు
కూడా మామధ్య లేడు.
10 దేవా, విరోధులు ఎంత కాలమని ఈ విధంగా
తిరస్కారం చేస్తారు?
శత్రువులు నీ పేరును ఎల్లప్పుడూ దూషిస్తూనే
ఉంటారా?
11 నీ చెయ్యి, నీ కుడి చెయ్యి ఎందుకు
వెనక్కు తీశావు?
నీ రొమ్ము మీదనుంచి చెయ్యి చాపి వాళ్ళను
నాశనం చెయ్యి.
12 పురాతన కాలం నుంచీ దేవుడే నా రాజు.
ఆయన భూమధ్యలో రక్షణ క్రియలు చేసేవాడు.
13 నీ బలంచేత సముద్రాన్ని పాయలుగా విభజించావు.
నీటిలో ఉన్న బ్రహ్మాండమైన ప్రాణుల తలలు
నీవు పగలగొట్టావు.
14 లివయాటాన్‌తలను చితగ్గొట్టి ముక్కలు చేశావు.
దానిని ఎడారి జంతువులకు ఆహారంగా ఇచ్చావు.
15 నీటి బుగ్గలను, నదులను తెరిచావు.
జీవ నదులను ఇంకిపొయ్యేట్టు చేశావు.
16 పగలు నీదే. రాత్రి కూడా నీదే.
సూర్యమండలాన్నీ, వెలుగునూ నీవే చేశావు.
17 భూమికి పొలిమేరలన్నీ నీవే నిర్ణయించావు.
ఎండకాలం, చలికాలం నీవే ఏర్పరచావు.
18 యెహోవా, శత్రువులు నిన్ను తిరస్కరించారనీ,
నీ పేరును మూర్ఖ ప్రజలు దూషించారనీ తలచుకో!
19 దుష్ట మృగానికి నీ గువ్వప్రాణాన్ని అప్పగించకు.
దీనావస్థలో ఉన్న నీ ప్రజలను శాశ్వతంగా
మరచిపోకు.
20 లోకంలో చీకటి స్థలాలు దౌర్జన్యపరుల
నివాసాలతో నిండి ఉన్నాయి
గనుక నీ ఒడంబడికను తలచుకో.
21 నలిగిపోయినవారిని ఆశాభంగంతో వెనక్కు
వచ్చేలా చెయ్యకు.
దీనదశలో ఉన్నవారు, అక్కరలో ఉన్నవారు
నీ పేరును స్తుతించేలా చెయ్యి.
22 దేవా, లే! నీ పక్షం నీవే వహించుకో.
మూర్ఖులు రోజంతా నిన్ను దూషిస్తున్నారని
జ్ఞాపకం ఉంచుకో.
23 నీకు వ్యతిరేకంగా చెలరేగేవాళ్ళ అలజడి
ఎడతెగకుండా పైకి లేస్తూ ఉంది.
ఈ నీ విరోధుల కేకలు మరువకు.