మూడో భాగం
(కీర్తనలు 73—89)
ఆసాపు కీర్తన
73
1 ఇస్రాయేల్‌ప్రజల పట్ల,
శుద్ధ హృదయం గలవారి పట్ల
దేవుడు మంచివాడు. ఇది తథ్యం.
2 అయితే నా విషయం చెప్పాలంటే
నా అడుగులు తొలగిపోవడానికి కొంచెంలో
తప్పింది.
నా పాదాలు ఇంచుమించు జారాయనే
చెప్పవచ్చు.
3 దుర్మార్గుల అభివృద్ధి చూచి,
ఆ గర్విష్ఠుల విషయం అసూయపడ్డాను.
4 తమ మరణ సమయంలో కూడా వాళ్ళకేమీ
యాతన అనిపించదు.
వాళ్ళు పుష్టిగా ఉన్నారు.
5 మనుషులందరికీ వచ్చే కష్టాలు వాళ్ళకు ఉండవు.
అందరిలాగే వాళ్ళ మీదికి విపత్తులు రావు.
6 అందుకని గర్వం వాళ్ళ మెడచుట్టూ
ఆభరణంలాగా ఉంది.
దౌర్జన్యం వాళ్ళకు వస్త్ర ధారణంలాగా ఉంది.
7 క్రొవ్వుచేత వాళ్ళ కండ్లు ఉబ్బి ఉన్నాయి.
వాళ్ళ హృదయంలోని కపటోపాయాలకు
మితం అంటూ లేదు.
8 వాళ్ళు వేళాకోళంగా మాట్లాడుతారు.
వాళ్ళ మాటల్లో దౌర్జన్యం ఉట్టిపడుతుంది.
వాళ్ళు బడాయిలు చెప్పుకొంటారు.
9 నోళ్ళు ఆకాశాన్ని అంటేలా పైకెత్తుకొంటారు.
వాళ్ళ నాలుకలు భూమిమీద అంతటా
ప్రాకుతాయి.
10 గనుక వాళ్ళ మనుషులు వాళ్ళవైపే తిరుగుతారు.
వాళ్ళు విస్తార జలం త్రాగుతారు.
11 “దేవుడికి ఏం తెలుసు?
సర్వాతీతుడనేవాడు ఎలా తెలుసుకుంటాడు?”
ఈ విధంగా వాళ్ళు తలపోస్తారు.
12 ఇరుగో వీళ్ళు దుర్మార్గులు.
వాళ్ళు ఎప్పుడూ సురక్షితంగా ఉన్నారు.
చాలా ఆస్తిపాస్తులు సంపాదించుకొనే వాళ్ళు.
13 నా హృదయం శుద్ధిగా ఉంచుకోవడం వ్యర్థమే,
నేను నిర్దోషినై నా చేతులు కడుక్కోవడం
కూడా వృథా అనిపించింది.
14 అయినా, రోజంతా నాకు బాధ!
ప్రతి ఉదయమూ నేను శిక్షకు గురి అవుతున్నాను.
15 “ఈ విధంగా మాట్లాడుదాం” అంటే
ఈ తరంలో ఉన్న నీ ప్రజలను తప్పుదారి
పట్టించి ఉండేవాణ్ణి అవుతాను.
16 ఇదంతా అర్థం చేసుకోవాలని నేను లోతుగా
ఆలోచించాను.
17 గాని, నేను దేవుని పవిత్రాలయంలో
ప్రవేశించేవరకు నాకు ఇది చాలా
విసుగు కలిగించింది.
అక్కడ వాళ్ళ చివరి స్థితిని గ్రహించాను.
18 నీవు వాళ్ళను జారుడు స్థలాలలో నిలబెట్టావు.
ఇందుకు అనుమానం లేదు.
వాళ్ళను నీవు పడవేస్తావు.
వాళ్ళు నాశనమవుతారు.
19 క్షణంలో వాళ్లు ధ్వంసమైపోతారు.
మహా భయాలకు గురి అయి వాళ్ళు సమూల
నాశనమవుతారు.
20 నిద్ర మేలుకొన్నప్పుడు కలను అలక్ష్యం చేసినట్టు,
ప్రభూ, నీవు లేచి వాళ్ళ రూపాన్ని అలక్ష్యం
చేస్తావు.
21 నా హృదయం దుఃఖంతో నిండిపోయింది,
నా అంతరంగం పోట్లు పొడుస్తూ వచ్చింది.
22 అప్పుడు నేను తెలివి తక్కువవాడుగా,
బుద్ధిహీనుడుగా ఉన్నాను.
నీ ఎదుట నేను మృగంలాంటివాడుగా ఉన్నాను.
23 అయినా నేను నీతో ఎల్లప్పుడూ ఉన్నాను.
నా కుడి చెయ్యి నీవు పట్టుకొన్నావు.
24 నాకు నీవు ఆలోచన చెపుతూ దారి చూపుతావు.
తరువాత నన్ను నీ వైభవ స్థలంలో
చేర్చుకొంటావు.
25 పరలోకంలో నా అనేవారు నాకింకెవరు?
నీవు నాకు ఉన్నావు.
ఇలా ఉండగా ఈ లోకంలో ఇంకెవ్వరూ,
ఏదీ నాకక్కరలేదు.
26 నా శరీరం, నా హృదయం కృశించిపొయ్యాయి.
కానీ, శాశ్వతంగా నా హృదయానికి ఆధారశిల,
నాకు కలిగిన వాటా దేవుడే!
27 నీకు దూరమైపోయినవాళ్ళు నాశనమవుతారు.
నిన్ను విడిచిపెట్టి వేశ్యలాగా ప్రవర్తించేవాళ్ళందరినీ
నీవు నాశనం చేస్తావు.
28 నా విషయం చెప్పనా?
దేవుని దగ్గర ఉండడమే నా మేలు.
నీ క్రియలన్నీ నేను చాటి చెప్పేలా
యెహోవా ప్రభువును నేను నమ్మి ఆశ్రయించాను.