సొలొమోను కీర్తన
72
1 ✽దేవా, రాజుకు నీ న్యాయ నిర్ణయాలు ప్రసాదించు.నీ రాకుమారుడికి నీ న్యాయబుద్ధిని అనుగ్రహించు.
2 ✝ఆయన నీ ప్రజలను న్యాయంతో, నీ దరిద్రులను
ధర్మ సమ్మతంగా పరిపాలిస్తాడు.
3 ✽ న్యాయాన్ని బట్టి ప్రజలకు పర్వతాలు,
చిన్న కొండలు క్షేమం చేకూరుస్తాయి.
4 ✽ప్రజలలో దరిద్రులకు రాజు న్యాయం చేకూరుస్తాడు.
అక్కరగలవాళ్ళ పిల్లలను రక్షిస్తాడు.
ఇతరులను హింసించేవాళ్ళను ఆయన
అణగద్రొక్కివేస్తాడు.
5 ✽సూర్యమండలం, చంద్రగోళం ఉన్నంతకాలం,
తరతరాలకూ వారు నీవంటే భయభక్తులు
కలిగి ఉంటారు.
6 ✽గడ్డి కోసిన మైదానంపై కురుసే వానలాగా,
భూమికి నీళ్ళు సరఫరా చేసే మంచి వర్షంలాగా
ఆయన దిగివస్తాడు.
7 ✽ఆయన రోజుల్లో న్యాయవంతులకు అభివృద్ధి.
చంద్రగోళం గతించేదాకా వాళ్ళకు అఖండ శాంతి.
8 ✽సముద్రం నుంచి సముద్రందాకా,
యూఫ్రటీసు నదినుంచి భూమి కొనలవరకు
ఆయన రాజ్యం చేస్తాడు.
9 ఆయనకు ఎడారి మనుషులు లొంగిపోతారు.
ఆయన శత్రువులు నేల మట్టి నాకుతారు.
10 తర్షీషుప్రాంతం రాజులు, ద్వీపాల రాజులు
అర్పణలు తెస్తారు.
షెబ, సెబా దేశాల రాజులు కానుకలు అర్పిస్తారు.
11 రాజులంతా ఆయనకు నమస్కారం చేస్తారు.
అన్ని దేశాలవారు ఆయనకు సేవ చేస్తారు.
12 ✽అక్కరలో ఉండి సహాయంకోసం మొరపెట్టే వారిని
ఆయన రక్షిస్తాడు.
దరిద్రులను, నిరాధారులను ఆయన విడిపిస్తాడు.
13 పేదసాదలను, అక్కరగలవాళ్ళను ఆయన
జాలితో చూస్తాడు.
అక్కరలో ఉన్న వాళ్ళను ఆయన రక్షిస్తాడు.
14 వారిని హింసనుంచీ, దౌర్జన్యంనుంచీ ఆయన
విడుదల చేస్తాడు.
ఆయన దృష్టిలో వాళ్ళ రక్తం విలువైనదిగా
ఉంటుంది.
15 ✽ఆయన చిరంజీవి అవుతాడు.
షెబ బంగారం ఆయనకు ఇస్తారు.
ఆయన కోసం ఎల్లప్పుడూ ప్రార్థనలు జరుగుతాయి.
రోజంతా అదేపనిగా ఆయనను స్తుతిస్తారు.
16 ✽దేశమంతటా, పర్వత శిఖరాల మీద
ధాన్య సమృద్ధి ఉంటుంది.
లెబానోను అడవి చెట్లలాగా దాని పంట
అల్లలాడుతూ ఉంటుంది.
పట్టణం ప్రజలు భూమిమీది మొక్కల్లాగా వికసిస్తారు.
17 ✽ఆయన పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
సూర్యమండలం ఉన్నంత కాలం ఆయన
పేరుప్రతిష్ఠలు వృద్ధి అవుతూ ఉంటాయి.
ఆయనమూలంగా అన్ని జనాలకూ ఆశీస్సులు
కలుగుతాయి.
వారు ఆయనను ధన్యుడని చెప్పుకొంటారు.
18 ✽యెహోవాకు స్తుతి!
ఆయనే దేవుడు, ఇస్రాయేల్‌ప్రజల దేవుడు.
అద్భుత కార్యాలు ఆయన మాత్రమే చేయగలడు.
19 ఆయన ఘనమైన పేరుకు శాశ్వతంగా స్తుతి
కలుగుతుంది గాక!
భూమి అంతా ఆయన మహిమతో నిండి
ఉంటుంది గాక! తథాస్తు! తథాస్తు!
20 ✽(యెష్షయి కుమారుడైన దావీదు ప్రార్థనలు సమాప్తం.)