71
1 యెహోవా, నేను నిన్నే నమ్మి ఆశ్రయించాను.
నేనెప్పుడూ సిగ్గుపడే పరిస్థితి రానియ్యకు.
2 నీ న్యాయం దృష్ట్యా నన్ను తప్పించు,
విడిపించు.
నీవు నా మనవి చెవినిబెట్టు, నన్ను రక్షించు.
3 నేనెల్లప్పుడూ ఆశ్రయించగలిగేలా
నీవే నాకు ఆధారశిలగా ఉండు.
నీవే నాకు ఆధారశిల. నీవే నా కోట.
నన్ను రక్షించడానికి సంకల్పించావు.
4  నా దేవా, దుర్మార్గుల బారినుంచి నన్ను విడిపించు.
చెడుగుకు ఒడికట్టేవాళ్ళ పట్టునుంచి,
దౌర్జన్యపరుల బారినుంచి నన్ను తప్పించు.
5 ప్రభూ! యెహోవా! నీలోనే నా ఆశాభావం.
చిన్నప్పటినుంచీ నిన్నే నమ్ముకుంటూ ఉన్నాను.
6 తల్లి గర్భంలో పడింది మొదలుకొని నీవే నాకు
అండగా ఉన్నావు.
తల్లి గర్భంలో నుంచి నన్ను పుట్టించినది నీవే.
నేను చేసే సంస్తుతి ఎల్లప్పుడూ నీ గురించే.
7 అనేకమందికి నేను వింతగా కనబడుతున్నాను.
కాని, నీవు నాకు బలమైన ఆశ్రయం.
8 నా నోరు రోజంతా నీ సంస్తుతితో,
నీ ఘనతతో నిండి ఉంది.
9  ముసలితనం పైబడినప్పుడు నన్ను వదలిపెట్టకు.
నా బలం ఉడిగిపోయినప్పుడు నన్ను విడువకు.
10 నా శత్రువులు నాకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు.
నా ప్రాణంకోసం దారి కాచేవాళ్ళు సమాలోచన
చేశారు.
11 వాళ్ళు చెప్పుకొన్నారు, “దేవుడు అతణ్ణి
విడిచిపెట్టాడు.
అతణ్ణి తరిమి పట్టుకోండి!
అతణ్ణి తప్పించేవాళ్ళేవరూ లేరులే!”
12 దేవా, నాకు దూరం కాబోకు.
నా దేవా, త్వరగా వచ్చి నాకు సహాయం చేయి.
13 నా ప్రాణానికి పగవాళ్ళు సిగ్గుపడి
నాశనమవుతారు గాక!
నాకు హాని తల పెట్టినవాళ్ళు
నిందపాలవుతారు గాక!
అవమానానికి గురి అవుతారు గాక.
14 నా ఆశాభావం ఎడతెగనిది.
నిన్ను ఇంకా ఎక్కువగా సంస్తుతి చేస్తాను.
15 నీ న్యాయం, నీ రక్షణ క్రియలు ఎల్లప్పుడూ
నా నోట వెల్లడి అవుతాయి.
వాటిని లెక్క పెట్టడానికి నాకు చేతకాదు.
16 యెహోవాప్రభువు చేసిన బలమైన పనులను
తెలియజేస్తాను.
నీ న్యాయాన్ని గురించి మాత్రమే మాట్లాడుతాను.
17 దేవా, నా బాల్యం నుంచీ నీవు నాకు ఉపదేశం
చేస్తూ వచ్చావు.
ఇప్పటివరకూ ఆశ్చర్యకరమైన నీ పనులను
నేను తెలియజేస్తూ వచ్చాను.
18 దేవా, రాబోయే తరానికి నీ బలం ప్రకటిస్తాను.
పుట్టబోయే వారందరికీ నీ ప్రభావం తెలుపుతాను.
నాకు తల నెరసిపోయి, నేను పండు ముసలిని
అయినప్పుడు నన్ను విడిచిపెట్టకు.
19 దేవా, నీ న్యాయం ఆకాశమంత ఎత్తయినది.
దేవా, నీవు గొప్ప పనులు చేస్తావు.
నీకు సాటి ఎవరు?
20 అనేక బాధలు, కడగండ్లు మేము
అనుభవించేలా చేశావు.
నీవు మమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తావు.
భూమిమీద ఉన్న అగాధంలో నుంచి మమ్మల్ని
మళ్ళీ లేవనెత్తుతావు.
21 మునుపటికంటే నీవు నన్ను ఎక్కువగా
గొప్ప చేస్తావు.
నా వైపు తిరిగి, నాకు ఆదరణ కలిగిస్తావు.
22 నా దేవా, తంతివాద్యాలతో నీ సత్యాన్ని బట్టి
నిన్ను సంస్తుతి చేస్తాను, నిన్ను కీర్తిస్తాను.
ఇస్రాయేల్‌ప్రజకు పవిత్ర దేవుడివి నీవు.
23 నీ సంకీర్తనం చేస్తూ ఉంటే, నా పెదవులు
ఆనంద ధ్వనులు చేస్తాయి.
నీవు విడిపించిన నా ప్రాణం కూడా ఆనందిస్తుంది.
24 నాకు కీడు తల పెట్టినవాళ్ళకు ఆశాభంగం
కలిగింది, అవమానం కలిగింది,
గనుక నా నాలుక రోజంతా నీ న్యాయాన్ని
చాటుతుంది.