గాయకుల నాయకుడికి. జ్ఞాపకం కోసం. దావీదు కీర్తన.
70
1 దేవా, నన్ను విడిపించడానికి త్వరగా రా!
యెహోవా, నాకు వెంటనే సహాయం చెయ్యి!
2 నా ప్రాణం తీసుకొనేందుకు వెదికేవాళ్ళు
ఆశాభంగం పొంది సిగ్గుపడతారు గాక!
నాకు కీడు కలిగితే సంతోషించేవాళ్ళు
అవమానంతో వెనక్కు ఒరుగుతారు గాక!
3 “ఇహిహీ” అంటూ వేళాకోళం చేసేవాళ్ళు
తమ అవమానానికి ప్రతిఫలంగా వెనక్కు
తిరిగిపోతారు గాక!
4  కాని, నిన్ను వెదికేవారంతా సంతోషిస్తూ
ఆనందిస్తూ ఉంటారు గాక!
నీవిచ్చే రక్షణను ప్రేమించేవారు “దేవుని
కీర్తి అధికం కావాలి!” అంటూ
ఎల్లప్పుడూ చెప్పుకొంటారు గాక!
5 నేను బాధల పాలవుతున్నాను,
దీనదశలో ఉన్నాను.
దేవా, నా దగ్గరికి త్వరగా రా!
నీవే నా సహాయం. నీవే నా రక్షకుడవు
యెహోవా, ఆలస్యం చెయ్యకు!