గాయకుల నాయకుడికి. రాగం: కలువలు. దావీదు కీర్తన.
69
1 ✽దేవా, నన్ను రక్షించు!నీళ్ళు నా ప్రాణం మీదికి ముంచుకు వస్తున్నాయి.
2 లోతైన దొంగ ఊబిలో నేను దిగబడిపోతున్నాను,
నిలవలేకపోతున్నాను.
లోతైన నీళ్ళలో పడిపొయ్యాను నేను.
వరదలు నన్ను ముంచివేస్తున్నాయి.
3 సహాయంకోసం పిలిచి పిలిచి అలసిపొయ్యాను.
నా గొంతు ఆర్చుకుపోయింది.
నా దేవునికోసం చూచి చూచి నా కండ్లు
చివికిపొయ్యాయి.
4 నిష్కారణంగా నన్ను ద్వేషించేవాళ్ళు✽ నా తల
వెంట్రుకల సంఖ్యను మించి ఉన్నారు.
నన్ను చంపాలని చూచేవాళ్ళు✽ ఎంతోమంది.
అబద్ధాల ఆధారంగా నాకు పగవారయ్యారు వారు.
నేను అపహరించనిది✽ ఇవ్వవలసివచ్చింది.
5 ✽దేవా, నా మూర్ఖత్వం నీకు తెలుసు.
నా అపరాధాలు నీకు తెలియనివి కావు.
6 ✽ప్రభూ! సేనల ప్రభువైన యెహోవా!✽
నీ కోసం ఎదురు చూచేవాళ్ళకు
నామూలంగా ఆశాభంగం కలగనియ్యకు.
ఇస్రాయేల్‌ప్రజల దేవా! నిన్ను వెదికేవాళ్ళకు
నామూలంగా అవమానం కలగకుండా చూడు.
7 ✽నీకోసం నేను నిందపాలయ్యాను.
నీకోసమే నా ముఖమంతా సిగ్గు ఆవరించింది.
8 నా సోదరులకే నేను పరాయివాణ్ణయిపొయ్యాను.
నా తల్లి కొడుకులకే నేను పరదేశిలాగా ఉన్నాను.
9 నీ ఇంటిని గురించిన ఆసక్తి✽ నన్ను తినివేసింది.
నిన్ను నిందించేవాళ్ళు మోపిన నిందలకు✽ నేను
గురి అయ్యాను.
10 ✽ ఉపవాసముండి నా ప్రాణం పోయేటంతగా ఏడ్చాను.
ఇదంతా నా మీద నింద అయింది.
11 గోనెపట్ట✽ కట్టుకొన్నాను నేను.
వాళ్ళకిది ఎగతాళి!
12 గుమ్మం✽ దగ్గర కూర్చునేవాళ్ళు
నన్ను గురించి కబుర్లాడుకొంటారు.
త్రాగుబోతులు✽ నన్ను గురించి పాటలు పాడుతారు.
13 ✽ నేనైతే నీకు ప్రార్థన చేస్తున్నాను, యెహోవా.
అనుకూల సమయంలో నాకు జవాబివ్వు.
దేవా, నీ అపార అనుగ్రహంవల్ల, నీ రక్షణ
సత్యాన్ని బట్టి నాకు జవాబివ్వు.
14 ఈ దొంగ ఊబిలో నేను దిగబడిపోకుండా చూడు.
ఇందులో నుంచి నన్ను తప్పించు.
నా పగవాళ్ళ బారినుంచి, ఈ లోతైన
నీళ్ళలోనుంచి నన్ను తప్పించు.
15 ఈ వరదలు నామీదుగా పొర్లిపారనియ్యకు.
ఈ అగాధం నన్ను మింగివేయకుండా చూడు.
నాశనకరమైన గుండం నోట నన్ను పడనియ్యకు✽.
16 యెహోవా, నీ అనుగ్రహం గొప్పది.
నాకు జవాబివ్వు.
నీ వాత్సల్య సమృద్ధిని బట్టి నా వైపు తిరుగు.
17 నీ సేవకుడనైన నాకు నీ ముఖం
కనబడకుండా చెయ్యకు.
నేను కష్టాలలో ఉన్నాను. నాకు త్వరగా జవాబివ్వు.
18 నాకు దగ్గరగా రా, విడుదల చెయ్యి.
నా శత్రువులను చూచి, మరీ నన్ను విడిపించు.
19 ✽నాకు కలిగిన నింద, సిగ్గు, అవమానం
నీకు తెలుసు.
నా విరోధులంతా నీ ఎదుటే ఉన్నారు.
20 ✽నిందలచేత నా గుండె బ్రద్దలైపోయింది.
నేనెంతగానో క్రుంగిపొయ్యాను.
జాలికోసం నేను చూచినా జాలిపడేవాడెవడూ లేడు.
ఓదార్చేవాళ్ళ కోసం చూచినా ఎవడూ
కనబడలేదు.
21 ✽ వాళ్ళు చేదు పదార్థాన్ని నాకు ఆహారంగా పెట్టారు.
నాకు దాహమైతే పులిసిన ద్రాక్షరసం తాగడానికి
ఇచ్చారు.
22 ✽ వాళ్ళ బల్ల✽ వాళ్ళకు ఉరి అవుతుంది గాక!
వాళ్ళు నిర్భయంగా ఉన్నప్పుడు అది వాళ్ళకు
బోను అవుతుంది గాక!
23 వాళ్ళు చూడలేకపోయేలా వాళ్ళ కండ్లకు చీకటి
కమ్ముతుంది గాక!
వాళ్ళ నడుములు గజగజ వణికిపోతూ
ఉంటాయి గాక!
24 నీ ఆగ్రహం వాళ్ళ మీద కుమ్మరించు!
నీ కోపాగ్ని వాళ్ళను పట్టుకొంటుంది గాక!
25 వాళ్ళ స్థలం పాడైపోతుంది గాక!
వాళ్ళ డేరాలలో ఒక్కడూ మిగలకుండా
పోతాడు గాక!
26 ✝నీవు మొత్తినవాణ్ణి వాళ్ళు హింసిస్తున్నారు.
నీ చేత గాయాలు పడ్డవారి వేదనగురించి వాళ్ళు
కబుర్లు చెప్పుకొంటున్నారు.
27 ✽వాళ్ళ అపరాధాలు ఒకదానికొకటి చేరి,
వృద్ధి కానియ్యి.
నీ న్యాయంలో వారు పాలిభాగస్తులు
కాకుండా చూడు.
28 ✽జీవగ్రంథంలో నుంచి వాళ్ళను తుడిచివెయ్యి.
న్యాయవంతుల జాబితాలో వాళ్ళ పేర్లు రాయకు.
29 ✝నేను బాధ అనుభవిస్తున్నాను,
వేదనపాలయ్యాను.
దేవా, నీ రక్షణ నన్ను పైకి ఎత్తుతుంది గాక!
30 ✽దేవుని పేరును గేయ రూపంలో స్తుతిస్తాను.
కృతజ్ఞత✽ అర్పిస్తూ ఆయనను ఘనపరుస్తాను.
31 ఇలా చేయడం ఎద్దును, కొమ్ములూ డెక్కలూ ఉన్న
దూడను అర్పించడంకంటే యెహోవాకు ఇష్టం.
32 ✽దీనదశలో ఉన్న భక్తులు ఇది చూచి ఆనందిస్తారు.
దేవుణ్ణి వెదికేవారలారా, మీ హృదయం
కొత్తగా బ్రతుకుతుంది గాక!
33 అక్కర గల వాళ్ళ మొర యెహోవా వింటాడు✽.
తన ఖైదీలను✽ ఆయన అలక్ష్యం చేయడు.
34 ✽ ఆకాశం, భూమి ఆయనను స్తుతిస్తాయి గాక!
సముద్రాలూ, వాటిలో చలించే ప్రాణులన్నీ
ఆయనను స్తుతిస్తాయి గాక!
35 ✝దేవుడు సీయోనును సంరక్షిస్తాడు.
ఆయన యూదాలో పట్టణాలను కట్టిస్తాడు.
వారు అక్కడ కాపురం ఉంటారు.
అది వారిదే అవుతుంది.
36 దేవుని సేవకుల సంతానం దానిని
వారసత్వంగా పొందుతారు.
ఆయన పేరును ప్రేమించేవారే అందులో ఉంటారు.