గాయకుల నాయకుడికి. ఒకపాట. దావీదు కీర్తన.
68
1 ✽✽దేవుడు లేస్తాడు. ఆయన శత్రువులు చెదరిపోతారు.ఆయన అంటే ద్వేషం ఉన్నవాళ్ళంతా
ఆయన ఎదుటనుంచి పారిపోతారు.
2 పొగ చెదరిపోయినట్లు నీవు వాళ్ళను
చెదరగొట్టివేస్తావు.
మైనం అగ్నికి కరిగిపోయినట్లు దుర్మార్గులు
దేవుని ఎదుట నాశనమైపోతారు.
3 న్యాయవంతులు ఆనందిస్తారు.
దేవుని సన్నిధానంలో సంతోషిస్తారు.
వారు అమితానందం అనుభవిస్తారు.
4 దేవునికి సంకీర్తనం చేయండి.
ఆయన పేరుకు స్తుతిగీతం పాడండి.
ఆయన ఎడారి ప్రదేశాలగుండా వాహనమెక్కి
ప్రయాణం చేసేవాడు.
ఆయనకు రాజమార్గం సిద్ధం చెయ్యండి.
ఆయన పేరు యెహోవా.
ఆయనయెదుట ఆనంద పారవశ్యం పొందండి.
5 తన పవిత్రాలయంలో ఉంటూ,
దేవుడు తండ్రి✽ లేని వాళ్ళకు తండ్రిగా ఉన్నాడు,
విధవరాండ్రకు న్యాయం చేకూర్చేవాడు.
6 ఒంటరివాళ్ళను ఇండ్లలో నివసించేలా
చేసే దేవుడు ఆయన.
ఖైదీలను విడుదల చేసి, వాళ్ళను అభివృద్ధిలోకి
నడిపిస్తాడు.
తిరుగబడేవాళ్ళు మాత్రమే ఎండిన ప్రదేశాల్లో
ఉండిపోతారు.
7 ✝దేవా, నీవు నీ ప్రజల ముందర
బయలుదేరినప్పుడు,
ఎడారిలోనుంచి నీవు
ప్రయాణమయినప్పుడు, (సెలా)
8 ✝భూమి కంపించింది,
దేవుని సమక్షంలో మిన్ను విరిగిపడింది.
దేవుని ఎదుట
ఇస్రాయేల్‌ప్రజల దేవుని ఎదుట
సీనాయి పర్వతం గజగజలాడింది.
9 ✝దేవా! నీ సొత్తయిన దేశంమీద సమృద్ధిగా
వర్షం కురిపించావు.
అది నీరసించిపోయినప్పుడు దానిని
సుస్థిరం చేశావు.
10 నీ మంద అందులో నివాసం ఏర్పరచుకొంది.
దేవా, నీ మంచితనం అనుసరించి
పేదలకు✽ వసతి కల్పించావు.
11 ✽ప్రభువు మాట చెప్పాడు.
స్త్రీలు ఓ పెద్ద సైన్యంగా దానిని ఇలా ప్రకటించారు:
12 “సైన్యాలు ఉన్న రాజులు పారిపోయారు,
పారిపోయారు.
ఇంటిపట్టున ఉన్న స్త్రీలు దోపిడీసొమ్ము
పంచుకొంటారు.”
13 ✽గొర్రెల దొడ్లలో మీరు విడిది చేసి ఉంటే
చూడడానికి గువ్వల రెక్కలకు వెండి
తాపడం చేసినట్టు ఉంది.
వాటి ఈకెలకు మేలిమి బంగారు పూత
పూసినట్టుంది.
14 ✽అక్కడ అమిత శక్తిమంతుడు రాజులను
చెదరగొట్టివేస్తూ ఉంటే
సలమన్‌మీద మంచు కురిసినట్లనిపించింది.
15 ✽బాషాను పర్వతపంక్తి కూడా దేవునిది.
బాషాను పర్వత పంక్తికి అనేక శిఖరాలున్నాయి.
16 అనేక శిఖరాలతో వెలుగొందే పర్వతాల్లారా!
దేవుడు తన నివాసంగా నియమించిన పర్వతాన్ని
ఎందుకలా చూస్తూ అసూయపడుతున్నారు?
యెహోవా అక్కడే నివాసముంటాడు.
17 ✽దేవుని రథాలు వేలాది వేలు.
ప్రభువు వాటిమధ్య సీనాయిదగ్గర
పవిత్ర స్థలంలో ఉండేవాడు.
18 ✽నీవు ఆరోహణమైపొయ్యావు.
ఖైదీలను నీవు చెరపట్టి తీసుకుపోయావు.
మనుషులలోనుంచి నీవు ఈవులు స్వీకరించావు.
యెహోవా దేవా, నీవు అక్కడ నివసించేలా
తిరుగుబాటు చేసినవాళ్ళలో నుంచి కూడా
నీవు ఈవులు స్వీకరించావు.
19 ప్రభువుకు సంస్తుతి! ప్రతి రోజూ✽ ఆయన
మన భారం✽ వహిస్తాడు.
దేవుడే మన రక్షణ. (సెలా)
20 మన దేవుడు రక్షించే దేవుడు.
యెహోవా అనే ప్రభువే మరణం✽నుంచి
తప్పించేవాడు.
21 ✽దేవుడు తన శత్రువుల తలలను
చితగ్గొట్టివేస్తాడు. ఇది ఖాయం.
అపరాధాలు చేయడం మాననివాళ్ళ మాడు మీద
కొట్టితీరుతాడు.
22 ప్రభువు చెప్పినదేమంటే,
“బాషానులోనుంచి మిమ్ములను రప్పిస్తాను.
సముద్రం లోతుల్లో నుంచి మిమ్ములను రప్పిస్తాను.
23 మీ శత్రువుల నెత్తురును మీ కాళ్ళక్రింద
తొక్కివేస్తారు.
వాళ్ళు మీ కుక్కల నాలుకల పాలవుతారు.”
24 ✽దేవా, నీ ఊరేగింపును వాళ్ళు చూశారు,
నా రాజైన దేవుడు పవిత్రాలయానికి ఊరేగడం
వాళ్ళు చూశారు.
25 గాయకులు ముందు నడిచారు.
వాళ్ళ వెంట వాయిద్యగాండ్లు నడిచారు.
కంజరీలు వాయిస్తూ వారిమధ్య కన్యలు నడిచారు.
26 సమాజాలలో దేవుణ్ణి స్తుతించండి.
ఇస్రాయేల్ ఊటలో నుంచి వచ్చిన వాళ్ళంతా
ప్రభువును స్తుతించండి.
27 అక్కడ బెన్యామీను అనే చిన్న గోత్రంవారు ఉన్నారు.
అది పరిపాలన చేసే గోత్రం.
యూదా నాయకులు వారి పరివారంతో
అక్కడ ఉన్నారు.
జెబూలూను నాయకులు,
నఫ్తాలి నాయకులు ఉన్నారు.
28 ✽నీ దేవుడు నీకు బలం ఉండాలని నియమించాడు.
దేవా, నీవు మాకోసం ఇది జరిగించావు.
నీ బలం కనుపరచుకో!
29 జెరుసలంలోని నీ పవిత్రాలయం కారణంగా
రాజులు నీ దగ్గరికి కానుకలు తెస్తారు.
30 జమ్ము గడ్డిలో ఉండే మృగాలను,
ఎద్దుల గుంపును ఖండించు.
దూడల్లాంటి జనాన్ని మందలించు.
వీళ్ళు లొంగిపోయి కప్పంగా వెండి తెచ్చేలా చెయ్యి.
యుద్ధాలంటే ఇష్టపడే వారిని దేవుడు చెదరగొట్టాడు.
31 ఈజిప్ట్‌నుంచి ప్రముఖులు వస్తారు.
కూషు దేవుని వైపు త్వరలో చేతులు చాపుతుంది.
32 ✽ఇహలోక రాజ్యాలూ!
దేవుణ్ణి గురించి పాడండి!
ప్రభు సంకీర్తనం చెయ్యండి! (సెలా)
33 అనాది కాలంనుంచి ఉన్న మహాకాశాలలో
ఆయన వాహనమెక్కి ప్రయాణమయ్యేవాడు.
ఆయనను కీర్తించండి.
ఆయన తన స్వరం వినిపిస్తాడు.
ఆయన స్వరం బలమైనది.
34 దేవునికి మహా బలం ఉందని చాటండి.
ఇస్రాయేల్‌మీద ఆయన ప్రతాపం ఉంది.
అంతరిక్షంలో ఆయన మహా బలం ఉంది.
35 తన పవిత్రాలయంలో ఆయన
భయభక్తులు కలిగించే దేవుడు.
ఇస్రాయేల్‌ప్రజల దేవుడు తానే వారికి
బలప్రభావాలను ప్రసాదిస్తాడు.
దేవునికి సంస్తుతి!