గాయకుల నాయకుడికి. కీర్తన, పాట.
66
1 ✽సర్వలోక ప్రజలారా!దేవుణ్ణి గురించి ఆనంద ధ్వనులతో పాడండి.
2 ఆయన పేరుప్రతిష్ఠలను ఉద్దేశించి
సంకీర్తనం చేయండి.
ఆయనకు ఘనత ఆరోపించి ఆయనను
కీర్తించండి.
3 ✽ దేవునితో ఇలా చెప్పండి:
“నీ క్రియలు ఎంత భయభక్తులను కలిగించేవి!
నీ మహా బల సంపన్నతనుబట్టి నీకు
శత్రువులు విధేయతను నటిస్తారు.
4 సర్వలోక ప్రజలు నిన్ను ఆరాధిస్తారు.
నిన్ను కీర్తిస్తారు.
నీ పేరును సంకీర్తనం చేస్తారు” (సెలా)
5 ✝దేవుని క్రియలను వచ్చి చూడండి.
మనుషులపట్ల తాను జరిగించే క్రియాకలాపాలలో
ఆయన భయభక్తులను కలిగించేవాడు.
6 ✽ ఆయన సముద్రం ఇంకిపోయేలా చేశాడు.
అది ఆరిపోయిన నేల అయింది.
నదిలో గుండా వాళ్ళు కాలినడకన వెళ్ళారు.
అక్కడ మనం ఆయనను బట్టి ఆనందిస్తాం.
7 ✽ఆయన బల సంపన్నుడై శాశ్వతంగా
పరిపాలన చేస్తున్నాడు.
జనాలను చూస్తూ ఉన్నాడు.
తిరుగుబాటు చేసేవాళ్ళు తమ్మును గొప్ప
చేసుకోకూడదు. (సెలా)
8 ✽లోక ప్రజలారా! మా దేవుణ్ణి స్తుతించండి.
ఆయన కీర్తిని గురించి చాటించండి.
9 ✽మనకు జీవాన్ని అనుగ్రహించాడాయన.
మనల్ని ప్రాణాలతో ఉంచుతున్నాడాయన.
ఆయన మన కాళ్ళు జారిపోనియ్యడు.
10 ✽దేవా, నీవు మమ్మల్ని పరీక్షించావు.
వెండి✽లాగా మమ్మల్ని పుటం పెట్టి శుద్ధి చేశావు.
11 మమ్మల్ని బందీలు✽గా చేశావు.
మా నడుములమీద పెద్ద బరువు పెట్టావు.
12 ✽మనుషులు మా నెత్తిమీదికెక్కి ఊరేగేలా చేశావు.
మేము మంటల్లో, నీళ్ళలో పడిపోయాం.
అయినా నీవు మమ్మల్ని బయటకు రప్పించి
సర్వ సమృద్ధిలో ప్రవేశపెట్టావు.
13 ✽నీ ఆలయంలోకి హోమ బలులతో వస్తాను.
నేను నీకు మొక్కుకొన్న ప్రకారం చేసి తీరుతాను.
14 కష్టాలలో చిక్కుకొన్నప్పుడు
నా పెదవులతో నేను మొక్కుకొన్నదంతా,
నోరార నేను మొక్కుకొన్నదంతా నీకు అర్పిస్తాను.
15 పొట్టేళ్ళ హోమ ధూమంతో పాటు కొవ్విన
గొర్రెలను నీకు అర్పిస్తాను.
ఎద్దులను, మేకపోతులను నీకు అర్పిస్తాను.
(సెలా)
16 ✽దేవుడంటే భయభక్తులు గల ప్రజలారా!
మీరంతా రండి, వినండి!
ఆయన నా ఆత్మకు ఏం చేశాడో తెలియజేస్తాను.
17 నేను నోరు తెరచి ఆయనకు ప్రార్థన చేస్తాను.
నా నాలుక మీద స్తుతిగీతం ఒకటి ఉంది.
18 ✽నా హృదయంలో నేను పాపంపై మనసు పెడితే
ప్రభువు నా ప్రార్థన వినడు.
19 దేవుడు తప్పకుండా నా ప్రార్థన విన్నాడు.
నా విన్నపం ఆయన ఆలకించాడు.
20 దేవునికి సంస్తుతి!
ఆయన నా ప్రార్థనను విసర్జించలేదు.
తన అనుగ్రహం నా దగ్గర నుంచి
తొలగించివేయలేదు.