గాయకుల నాయకుడికి. దావీదు కీర్తన. ఒక పాట.
65
1 దేవా! సీయోనులో నీ ఎదుట మౌనంగా ఉండడం,
నిన్ను స్తుతించడం యోగ్యం.
నీకు మ్రొక్కుకొన్న ప్రకారం చేసితీరాలి.
2 నీవు ప్రార్థన వినేవాడవు.
మానవత యావత్తు నీ దగ్గరికి వస్తుంది.
3 అపరాధాలు నన్ను జయించాయి.
అయితే నీవు మా అతిక్రమాలను కప్పివేశావు.
4 నీ ఆలయం పరిసరాలలో ఉండడానికి నీవు
ఎన్నుకొని నీదగ్గర చేర్చినవారు ధన్యజీవులు!
నీ పవిత్రాలయం అనే నీ ఇంట్లో ఉన్న
ఆశీస్సులు మాకు సంతృప్తి కలిగిస్తాయి.
5 మా రక్షణకర్తవైన దేవా!
భయభక్తులను కలిగించే కార్యకలాపాల ద్వారా
న్యాయసమ్మతంగా నీవు మాకు జవాబిస్తావు.
భూమి కొనలన్నిట్లో ఉన్నవారికీ,
సుదూర సముద్ర తీర వాసులకూ నీవే ఆశ్రయం.
6 ప్రభావ సంపన్నతే ఆయనకు నడికట్టు.
తన బలంతో పర్వతాలను సుస్థిరం చేశాడు.
7 ఆయన సముద్రం హోరునూ అలల ఘోషనూ
ప్రశాంతం చేస్తాడు.
జనాల కలకలం అణచివేస్తాడు.
8 భూగోళం పొలిమేరలలో నివసించే ప్రజలు
నీ సూచకమైన క్రియలు చూచి భయపడుతారు.
ఉదయ సాయంత్రాల ఆరంభం
ఉత్సాహ జనకమైన పాటతో నింపివేస్తున్నావు.
9 నీవు ఈ భూమిని సందర్శిస్తావు.
అది పొంగి పొర్లిపోతుంది.
దానిని చాలా ఫలవంతం చేస్తావు.
దేవుని నది జలమయం.
మనుషులకు ధాన్యం అనుగ్రహిస్తావు.
నీవు భూమిని సంసిద్ధం చేస్తావు.
10 దాని దుక్కులకు సమృద్ధిగా నీరు ప్రసాదిస్తావు.
నాగటి చాళ్ళమధ్య భూమిని సమతలం చేస్తావు.
వాన జల్లులతో అది మెత్తబడేలా చేస్తావు.
మొలకెత్తినప్పుడు దానిని నీవు దీవిస్తావు.
11 సంవత్సరమంతటికీ నీవు చేసిన మేలు
మకుటాయమానంగా ఉంది.
నీ రథ చక్రాల జాడలు జీవసారం
ఒలకబోస్తున్నాయి.
12 అడవి బీళ్ళు నాని సారాన్ని చిందుతున్నాయి.
కొండలు ఆనందాన్ని నడుముకు చుట్టుకొన్నాయి.
13 పచ్చిక మైదానాలను గొర్రెల
మందలు వస్త్రంలాగా అలంకరించాయి.
లోయలో అంతటా సస్యాలే.
అవన్నీ ఆనంద ధ్వనులు చేస్తున్నాయి.
అన్నీ సంగీతం పాడుతున్నాయి.