గాయకుల నాయకుడికి. దావీదు కీర్తన.
64
1 ✽దేవా, నేను మొరలిడుతున్నాను.నా మనవి చెవిని బెట్టు.
పగవాళ్ళంటే నాకు భయం లేకుండా నన్ను కాపాడు.
2 దుర్మార్గుల కుట్రనుంచి నన్ను దాచిపెట్టు.
అక్రమకారులు చేసే అల్లరినుంచి నన్ను తప్పించు.
3 వాళ్ళ నాలుకలు కత్తులలాంటివి.
వాటికి పదును పెట్టుకొన్నారు.
వాళ్ళ విషవాక్కులు బాణాలలాంటివి.
వాటిని విల్లెక్కు పెడతారు.
4 ✽వాళ్ళు మాటున ఉండి నిర్దోషుల మీదికి
ఆ బాణాలు విసురుతారు.
అకస్మాత్తుగా వారిని కొడతారు.
వాళ్ళకు భయమంటూ లేదు.
5 వాళ్ళు దురాలోచనలు చేస్తూ వాటిలో తమను
బలపరుచుకొంటారు.
రహస్యంగా వలలు వేసి పట్టుకుందామని
చెప్పుకొంటారు.
“మమ్మల్ని ఎవరు చూస్తారు?” అనుకొంటారు.
6 చెడుగు చేయడానికి అవకాశాలకోసం వాళ్ళు
వెదుకుతూ ఉంటారు.
ఉపాయంతో పన్నాగాలు రూపొందించి
సిద్ధంగా ఉంటారు.
మనిషి అంతరంగం, హృదయం✽ లోతైనవి.
7 ✽కాని, దేవుడు తన బాణం వాళ్ళమీద వేస్తాడు.
ఉన్నట్టుండి వాళ్ళకు గాయాలు తగులుతాయి.
8 వాళ్ళు కూలిపోతారు.
వాళ్ళ పతనానికి కారణం వాళ్ళ నాలుకే.
వాళ్ళను చూచినవారంతా తల పంకిస్తారు.
9 ✽అప్పుడు మనుషులందరికీ భయం వేస్తుంది.
దేవుని పనులు ప్రకటిస్తారు.
ఆయన క్రియలు వాళ్ళు బాగా తలపోస్తారు.
10 న్యాయవంతులు యెహోవాను బట్టి ఆనందిస్తారు.
ఆయన్నే నమ్మి ఆశ్రయిస్తారు.
హృదయంలో నిజాయితీపరులంతా అతిశయిస్తారు.