దావీదు యూదా ఎడారిలో ఉన్నప్పుడు రాసిన కీర్తన.
63
1 ✽దేవా, నీవే నా దేవుడు✽.మనసారా నేను నిన్ను వెదుకుతాను.
నా అంతరంగం నీకోసం✽ దప్పిగొంటూ ఉంది.
నా శరీరం నీకోసం తహతహలాడుతూ ఉంది.
ఎండిపోయి ఆయాసం కలిగించే భూమి,
నీరు లేని ప్రదేశమిది.
2 ✽నీ పవిత్రాలయంలో నేను నిన్ను చూచినట్టు,
నీ బల ప్రభావాలను, నీ వైభవాన్ని చూడాలని
ఎంతో ఆశిస్తున్నాను.
3 ✽✽నీ అనుగ్రహం జీవితంకంటే శ్రేష్ఠం.
నాపెదవులు నిన్ను కీర్తిస్తాయి.
4 నేను బ్రతికినన్నాళ్ళు నిన్ను స్తుతిస్తాను.
నీ పేర నేను చేతులు పైకెత్తుతాను.
5 నా అంతరంగంలో నాకెంతో తృప్తి కలుగుతుంది.
కొవ్వు, మూలుగ భుజించినట్టుంది నాకు.
నా పెదవులు ఆనంద ధ్వనులు చేస్తాయి.
నా నోరు నిన్ను కీర్తిస్తుంది.
6 ✽నేను పడకపై పడుకొని నిన్ను జ్ఞాపకం చేసుకొన్నప్పుడు
రాత్రి జాములలో నీ మీదే ధ్యానం చేస్తాను.
7 నాకు సహాయం✽ చేసినవాడివి నీవే.
నీ రెక్కల✽ నీడలో నేను ఆనందంతో పాడుతాను.
8 ✽నా అంతరంగం నిన్నే అనుసరిస్తూ
అంటిపెట్టుకొని ఉంది.
నీ కుడి చెయ్యి నాకు ఆధారం ఇస్తూ ఉంది.
9 ✽నా ప్రాణం తీయాలని అవకాశాలు వెదుకుతున్న
వాళ్ళు భూమి అగాధాలకు దిగిపోతారు.
10 వాళ్ళు కత్తిపాలై కూలుతారు.
వాళ్ళ గతి నక్కలపాలే.
11 రాజునైన నేను దేవునిమూలంగా సంతోషిస్తాను.
ఆయనమీద ప్రమాణం చేసేవాళ్ళందరికీ ఎంతో
అతిశయం కలుగుతుంది.
అబద్ధాలాడేవాళ్ళ నోరు దేవుడు నొక్కివేస్తాడు.