గాయకుల నాయకుడికి. రాగం: యెదూతూను. దావీదు కీర్తన.
62
1 నేను మౌనంగా దేవునిపై నమ్మకంతో
ఎదురు చూస్తున్నాను.
ఆయనమూలంగానే నాకు రక్షణ కలుగుతుంది.
2 ఆయనే నాకు ఆధారశిల. నాకు రక్షణ ఆయనే.
ఆయనే నాకు ఎత్తయిన కోట.
నన్ను ఏదీ ఎక్కువగా కదిలించదు.
3 ఎంత కాలమని మీరంతా ఈ ఒకే మనిషి మీదికి
ఎగబడతారు?
ఎంత కాలం మీరు అతణ్ణి పడగొట్టాలని చూస్తారు?
అతడు అసలే ప్రక్కకు ఒరిగిన గోడలాంటివాడు.
కూలిపోయే కంచెలాగా ఉన్నాడు.
4 అతడు పైకి వచ్చిన స్థానంనుంచి అతణ్ణి ఎలా
పడలాగాలా అని వాళ్ళ ఆలోచన.
వాళ్ళకు అబద్ధాలంటే ఎంతో ఇష్టం.
నోట్లో దీవెనలూ, హృదయంలో శాపనార్థాలూ
అదీ వాళ్ళ తంతు. (సెలా)
5 మనసా! మౌనంగా దేవుని వైపే నమ్మకంతో
ఎదురు చూడు!
ఆయన మూలంగానే నాకు ఆశాభావం కలుగుతుంది.
6 ఆయనే నాకు ఆధారశిల. నాకు రక్షణ ఆయనే.
ఆయనే నాకు ఎత్తయిన కోట – నన్నేదీ కదిలించదు.
7 నా విముక్తి, నా మహత్యం దేవునిమీదే
ఆధారపడి ఉన్నాయి. ఆయనే నాకు ఆశ్రయం.
8 జనులారా! అన్ని సమయాల్లోనూ ఆయన్నే
నమ్ముకోండి!
ఆయన ఎదుట మీ హృదయాలు కుమ్మరించుకోండి!
దేవుడు మనకు ఆశ్రయ స్థానం! (సెలా)
9 మనిషి సంతానం పనికిమాలినవాళ్ళు.
ఘనులు కూడా అబద్ధం రూపొందినవాళ్ళు.
త్రాసులో వాళ్ళను తూకం వేస్తే వాళ్ళ సిబ్బి
తేలిపోతుంది.
వాళ్ళంతా ఊపిరికంటే తేలిక మనుషులు.
10 దౌర్జన్యంలో మీ నమ్మకం ఉంచకండి. దోపిడీలు చేస్తూ విర్రవీగకండి.
ధనం ఎక్కువైతే దానిమీద ఆధారపడకండి.
11 దేవుడు ఒక సంగతి చెప్పాడు.
దానిని రెండు సార్లు విన్నాను.
“బలప్రభావాలు దేవునికే చెంది ఉన్నాయి”
అనేదే ఆ మాట.
12 ప్రభూ! అనుగ్రహం కూడా నీదే.
మనుషులందరికీ వాళ్ళ క్రియల ప్రకారం
ప్రతిఫలం ఇచ్చేది నీవే.