గాయకుల నాయకుడికి. రాగం: ఒడంబడిక కలువ. ఉపదేశంకోసం దావీదు రాసిన రసిక కావ్యం. అతడు అరామ్నరాయీం వాళ్ళ మీద అరమ్జోబోవాళ్ళమీద యుద్ధం చేసినప్పుడు యోవాబు తిరిగి వెళ్ళి ఉప్పులోయలో పన్నెండు వేలమంది ఎదోంవాళ్ళను చంపిన సమయంలో దావీదు ఇది రాశాడు.
60
1 ✽✽దేవా, నీవు మమ్మల్ని విసర్జించావు.మమ్మల్ని విరగగొట్టావు. మామీద కోపపడ్డావు.
మమ్మల్ని మళ్ళీ సరిదిద్దు.
2 ఈ దేశాన్ని కదలించివేశావు.
దానిని బ్రద్దలు కొట్టావు.
అది గజగజలాడుతూ ఉంది.
దెబ్బ తిన్న చోట్ల దానిని బాగు చెయ్యి.
3 నీ ప్రజలకు కఠినమైన అనుభవాలు
కలిగేలా చేశావు.
తూలేట్టు చేసే ద్రాక్షమద్యాన్ని✽ మాచేత
పానం చేయించావు.
4 ✽నీవంటే భయభక్తులున్న వారికి నీవు ఒక
జెండా✽ ఇచ్చావు.
సత్యంకోసం దానిని పైకెత్తాలని వారికిచ్చావు. (సెలా)
5 నీ ప్రియ ప్రజలకు విడుదల కలిగేలా
నీ కుడి చేతితో మమ్మల్ని రక్షించు.
6 ✽తన పవిత్ర స్థలంనుంచి దేవుడు మాట ఇచ్చాడు.
నేను ఆనందిస్తాను.
షెకెం కనుమను పంచి ఇస్తాను.
సుక్కోత్‌లోయ✽ కొలిపించి ఇస్తాను.
7 గిలాదు నాదే. మనష్షే✽ నాదే.
ఎఫ్రాయిం నా శిరస్త్రాణం.
యూదా నా రాజదండం✽.
8 ✽మోయాబు కాళ్ళు కడుగుకొనే నా పాత్ర.
ఎదోంమీదికి నా పాదరక్ష విసిరివేస్తాను.
ఫిలిష్తీయా! నా గురించి కేకలుపెట్టు!
9 ✽గోడ, కోట ఉన్న పట్టణానికి నన్ను
తీసుకువెళ్ళే వాడెవడు?
ఎదోంకు నన్ను వెంటబెట్టుకు వెళ్ళేవాడెవడు?
10 దేవా, నీవు మమ్మల్ని విసర్జించావు గదూ.
దేవా, మా సేనలతో నీవు రావడం
మానివేశావు గదూ.
11 ✽శత్రువులను ఓడించడానికి మాకు సహాయం చెయ్యి.
మనిషి చేయగల సహాయం వృథా.
12 దేవుని ద్వారానే మేము విజయం సాధిస్తాం.
మా శత్రువులను ఆయనే అణగద్రొక్కి వేస్తాడు✽.