గాయకుల నాయకుడికి. రాగం: నాశనం చేయకు. దావీదును చంపుదామని సౌలు అతని ఇంటి దగ్గర పొంచి ఉండడానికి మనుషులను పంపాక దావీదు రాసిన రసిక కావ్యం.
59
1 ✽నా దేవా, నా పగవాళ్ళ✽ బారినుంచినన్ను, తప్పించు.
నామీదికి ఎగబడేవాళ్ళనుంచి నన్ను కాపాడు.
2 చెడుగు చేసే వాళ్ళ బారినుంచి
నన్ను తప్పించు.
రక్తపాతానికి ఒడికట్టేవాళ్ళ నుంచి నన్ను రక్షించు.
3 ఇదిగో, నా ప్రాణంకోసం వాళ్ళు
పొంచి ఉన్నారు.
దౌర్జన్యపరులు నాకు వ్యతిరేకంగా సమకూడారు.
యెహోవా, నేను పాపం చేయబట్టి కాదు.
నేను అక్రమం చేసినందు చేత కూడా కాదు.
4 ✽నాలో ఏ అపరాధం లేకపోయినా,
వాళ్ళు పరుగెత్తి సంసిద్ధులవుతున్నారు.
5 ✽ నన్ను కలుసుకోవడానికి లే! నా స్థితి చూడు!
సేనల ప్రభువైన యెహోవా! దేవా!
ఇస్రాయేల్‌ప్రజల దేవా!
సర్వలోక ప్రజలను శిక్షించడానికి లే!
ద్రోహం తల పెట్టేవాళ్ళలో ఎవరినీ
కరుణ చూడకు (సెలా)
6 ✽ సాయంకాలం వాళ్ళు మళ్ళీ వస్తారు.
కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూరా
తిరుగుతూ ఉంటారు.
7 “ఎవరూ వినడం లేదులే” అనుకొని
మాట్లాడుతారు.
నోటినుంచి దూషణలు వెళ్ళగక్కుతారు.
వాళ్ళ పెదవుల్లో కత్తులు ఉన్నాయి.
8 ✽ యెహోవా, నీవు వాళ్ళను చూచి నవ్వుతావు.
సర్వలోక ప్రజలను చూచి నీవు పరిహాసం
చేస్తావు.
9 ✝నీవే నా బలం. నీ కోసమే నేను ఎదురు
చూస్తాను.
నాకు దేవుడు ఎత్తయిన కోటలాంటివాడు.
10 ✽అనుగ్రహం చూపి నా దేవుడు నన్ను
సమీపించి సహాయం చేస్తాడు.
నా పగవాళ్ళ ఓటమిని దేవుడు నన్ను చూడనిస్తాడు.
11 ✽వాళ్ళను చంపవద్దు!
అలా చంపితే నా ప్రజలు ఆ సంగతే
మరచిపోవచ్చు.
ప్రభూ! మాకు డాలులాంటివాడా!
నీ బలపరాక్రమాలను వినియోగించి వాళ్ళను
చెదరగొట్టు.
వాళ్ళను అణగారిపోనియ్యి!
12 నోట్లో ఉన్న దోషాలను వాళ్ళ పెదవులు
మాటల్లో వెల్లడి చేస్తాయి.
వాళ్ళ మాటల్లో ఉట్టిపడే శాపాల, అబద్ధాల
కారణంగా వాళ్ళ గర్వమే వాళ్ళను
చిక్కులు బెడుతుంది.
13 ఆగ్రహంతో వాళ్ళను నాశనం చెయ్యి.
భూమి మీద లేకుండా వాళ్ళను
నాశనం చెయ్యి.
దేవుడు యాకోబుప్రజకు పరిపాలకుడని
భూతలం ఆ కొననుంచి ఈ కొనదాకా
మనుషులు తెలుసుకొనేలా
ఈ విధంగా చెయ్యి. (సెలా)
14 సాయంకాలం వాళ్ళు మళ్ళీ వస్తారు.
కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూరా
తిరుగుతూ ఉంటారు.
15 ఏమి తిందామా అని అటూ ఇటూ
తిరుగాడుతూ ఉంటారు.
కడుపు నిండకపోతే, రాత్రంతా అలాగే ఉంటారు.
16 నీ బలప్రభావాలను నేను స్తుతిస్తాను.
నీ అనుగ్రహాన్ని పురస్కరించుకొని ఉదయ
కాలంలో నేను సంతోషంతో పాడుతాను✽.
ఎందుకంటే నీవు నాకు ఎత్తయిన కోటలాంటివాడివి.
నా కష్టాలలో నీవు నాకు ఆశ్రయ స్థానం✽.
17 నాకు బలంగా ఉన్న దేవా! నిన్నే కీర్తిస్తాను.
దేవుడు నాకు ఎత్తయిన కోటలాంటివాడు,
అనుగ్రహం చూపే దేవుడు.