గాయకుల నాయకుడికి. రాగం: నాశనం చేయకు. దావీదు రసిక కావ్యం.
58
1 అధికారులారా! మీరు నిజంగా న్యాయంతో
మాట్లాడుతారా?
మనుషులారా! మీరు నిజాయితీతో తీర్పు తీరుస్తారా?
2 అలా చేయరు.
హృదయంలో చెడుగు కల్పిస్తారు.
ఈ దేశంలో కూడా మీరు చేజేతులా
దౌర్జన్యాన్ని తూచి మరీ చెల్లిస్తున్నారు.
3 దుర్మార్గులు పుట్టుకతోనే
విపరీత బుద్ధులు.
పుట్టినవెంటనే అబద్ధాలాడుతూ
దారి తప్పిపోతారు.
4 నాగుపాము విషంలాంటి విషం వాళ్ళకు ఉంది.
వీళ్ళు చెవులు మూసుకొన్న చెవిటి
పామువంటివాళ్ళు.
5 మాంత్రికులు నేర్పుగా ప్రయోగించిన
మంత్రాలు వినని పాములాగా ఉన్నారు.
6  దేవా! వాళ్ళ నోటిపళ్ళు ఊడగొట్టు!
యెహోవా! ఈ సింహాల కోరలను
ఊడబెరుకు!
7 పారే నీటిలాగా వాళ్ళు కరిగిపోతారు గాక!
వాళ్ళు బాణం వేస్తే, అది ముక్కలు
చెక్కలైపోతుంది గాక!
8 నడిచిపోతూ, కరిగిపోయే నత్తలాగా
వాళ్ళు ఉండాలి!
వాళ్ళు పొద్దును ఎన్నడూ చూడని
గర్భస్రావంలాగా కావాలి!
9 ముండ్ల కంపతో చేసిన మంటల సెగ
మీ కుండలకు తగలకముందే
వాటిలోది ఉడికినా, ఉడకకపోయినా,
దేవుడు దానిని
సుడిగాలితో ఎగరగొట్టివేస్తాడు.
10 ఆ ప్రతిక్రియను చూచి
న్యాయవంతులు సంతోషిస్తారు.
దుర్మార్గుల రక్తంలో వారు కాళ్ళు కడుక్కుంటారు.
11  మనుషులు ఇది చూచి ఇలా అంటారు:
“న్యాయవంతులకు బహుమానం తప్పక ఉంటుంది.
ఖండితంగా ఈ లోకంలో న్యాయం చేకూర్చే
దేవుడు ఉన్నాడు.”