గాయకుల నాయకుడికి. రాగం: నాశనం చేయకు. సౌలు దగ్గరనుంచి దావీదు గుహకు పారిపోయాక అతడు రాసిన రసిక కావ్యం.
57
1 ✽నన్ను దయ చూడు, దేవా,నన్ను దయ చూడు!
నా అంతరంగం నీలో దాక్కొన్నది.
ఈ నాశనకరమైన పరిస్థితులు గడిచిపోయేదాకా
నీ రెక్కల✽ నీడలో నేను దాక్కొంటాను.
2 ✽సర్వాతీతుడైన దేవునికి నేను
మొర పెట్టుకొంటున్నాను.
ఆయనే నాకోసం పని కొనసాగిస్తాడు.
3 ఆయన పరలోకంనుంచి ఆజ్ఞ ఇస్తాడు.
నన్ను విడిపిస్తాడు.
నన్ను దిగమింగాలని చూచేవాళ్ళు నామీద
చాడీలు పలుకుతూ ఉంటే
దేవుడు తన అనుగ్రహమూ,
సత్యమూ పంపుతాడు. (సెలా)
4 ✽ సింహాలమధ్య నా ప్రాణం ఉంది.
నిప్పులు వెళ్ళగ్రక్కే వాళ్ళమధ్య నేను
పడుకోవలసివచ్చింది.
ఈ మనుషుల పళ్ళు ఈటెలలాంటివి. అవి బాణాలే!
వాళ్ళ నాలుక పదునైన కత్తిలాంటిది.
5 ✽దేవా, నీవు ఆకాశాలకంటే ఉన్నత
స్థానంలో ఉన్నావని బయలుపరచు.
భూతలమంతటిమీదా నీ మహిమ కనబడనియ్యి.
6 ✝నా పాదాలను చిక్కించుకోవాలని వారు వల వేశారు.
నా ప్రాణం క్రుంగిపోయింది.
నా కోసం వాళ్ళు గుంట తవ్వారు గాని,
దానిలో వాళ్ళే పడ్డారు. (సెలా)
7 ✽నా హృదయం నిబ్బరంగా✽ ఉంది, దేవా,
నా హృదయం నిబ్బరంగా ఉంది.
నేను పాడుతాను, సంకీర్తనం చేస్తాను.
8 నా మనసా! మేలుకోవే! మేలుకో!
స్వరమండలమా, తంతివాద్యమా మేల్కోండి!
నేను ప్రొద్దున్నే పెందలకడనే మేలుకుంటాను.
9 నీ అనుగ్రహం ఆకాశాన్ని
అంటేంత గొప్పది.
నీ సత్యం మిన్నంటుతూ ఉంది.
10 గనుక ప్రభూ! జనాలమధ్య నిన్ను సన్నుతిస్తాను.
ఇతర జాతులమధ్య నిన్ను స్తుతిస్తాను.
11 దేవా, నీవు ఆకాశాలకంటే ఉన్నత స్థానంలో
ఉన్నావని బయలుపరచు.
భూతలమంతటిమీదా నీ ఘనత కనబడనియ్యి.