గాయకుల నాయకుడికి. రాగం: దూరమైన సిందూరవృక్షం మీద ఉన్న గువ్వ. ఫిలిష్తీయవాళ్ళు దావీదును గాతులో పట్టుకొన్నాక అతడు రాసిన రసిక కావ్యం.
56
1 ✽✽దేవా, నన్ను దయ చూడు!మనుషులు నన్ను దిగమింగాలని
తహతహలాడుతున్నారు.
ప్రొద్దస్తమానం పోరాటమే.
వాళ్ళు నన్ను వేధించుకు తింటున్నారు.
2 చాలా మంది గర్విష్ఠులై నాతో యుద్ధానికి
తలపడుతున్నారు.
నా శత్రువులు అదేపనిగా నన్ను దిగమింగాలని
తహతహలాడుతున్నారు.
3 ✽నాకు భయం కలిగే రోజున నీమీద
నమ్మకం ఉంచుతాను.
4 దేవునిమూలంగా నేను ఆయన వాక్కును కీర్తిస్తాను.
దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను.
నేనేమీ భయపడను. శరీరులు నన్నేం చేయగలరు?
5 ✽రోజంతా వీళ్ళు నా మాటలకు విపరీతార్థం
కల్పిస్తారు.
నాకు ఎప్పటికీ కీడు చేయాలనే వాళ్ళ తలంపు.
6 వాళ్ళు ముఠాగా పొంచి ఉంటారు.
నా ప్రాణం తియ్యాలని నా అడుగులు చూస్తారు.
7 ✝దుర్మార్గం చేస్తూ వీళ్ళు తప్పించుకోగలరా?
దేవా, కోపంతో ఈ ప్రజలను పడదొయ్యి!
8 నేను పారిపోయి తిరుగాడుతూ ఉంటే
నీవు లక్ష్య పెట్టావు.
నా కన్నీళ్ళు✽ నీ సీసాలో పట్టి ఉంచు!
అవి నీ గ్రంథం✽లో రాసి ఉంచావు గదూ?
9 ✽నేను నిన్ను వేడుకుంటాను.
ఆ రోజునే నా శత్రువులు వెనక్కు తగ్గుతారు.
దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఇది నాకు తెలుసు.
10 దేవునిమూలంగా నేను ఆయన వాక్కును కీర్తిస్తాను.
యెహోవామూలంగా ఆయన వాక్కును కీర్తిస్తాను.
11 దేవునిలో నేను నమ్మకం పెట్టుకొన్నాను.
నేనేమీ భయపడను. మనుషులు నన్నేం
చేయగలరు?
12 దేవా, నీవు మరణం✽నుంచి నన్ను తప్పించావు,
నా అడుగులు తడబడకుండా✽ కాపాడావు.
జీవం వెలుగులో దేవుని ఎదుట నేను
నడవగలిగేలా చేశావు.
13 అందుచేత నీకు నేను అర్పిస్తానని
మొక్కుకొన్నది నామీదే నిలిచి ఉంది.
నేను నీకు కృతజ్ఞతలు✽ అర్పిస్తాను.