గాయకుల నాయకుడికి. తంతి వాద్యాలతో పాడతగ్గది. దావీదు దైవధ్యానం.
55
1  దేవా, నా ప్రార్థన చెవినిబెట్టు.
నా విజ్ఞప్తికి ముఖం త్రిప్పుకోకు.
2 నా మనవి విను. జవాబు చెప్పు.
శత్రువులు వేసే కేకలు,
దుర్మార్గులు పెట్టే హింసల కారణంగా
3 నా తలంపులలో నేను అటూ ఇటూ
కొట్టుమిట్టాడుతున్నాను.
మూలగక తప్పడం లేదు నాకు.
దౌర్జన్యాన్ని నామీద జరిగిస్తారు వాళ్ళు.
కోపంతో నా వెంటబడుతున్నారు.
4  నాకు హృదయంలో ఎంతో వేదన కలిగింది.
మరణ బీతి నా మీద పడింది.
5 భయమూ, వణుకూ నామీదికి వచ్చాయి.
భయాతిరేకం నన్ను ఆవరించింది.
6 అహో, పావురంలాగా నాకూ రెక్కలుంటే
నేను ఎగిరిపోయి, హాయిగా ఉండేవాణ్ణి గదా.
7 దూరంగా ఎక్కడికో త్వరగా వెళ్ళిపోయి ఉండేవాణ్ణి,
అరణ్యంలో ఉండిపోయేవాణ్ణి. (సెలా)
8 పెనుగాలినీ, తుఫానునూ వేగంగా
తప్పించుకొని ఉండేవాణ్ణి అనుకున్నాను.
9 పట్టణంలో బలాత్కారం,
పోరాటాలు నేను చూస్తున్నాను.
ప్రభూ! అలాంటి కార్యాలు చేసేవాళ్ళను
తుదముట్టించు!
వాళ్ళ మాటలు తారుమారు చెయ్యి!
10 రాత్రింబగళ్ళు వాళ్ళు పట్టణం గోడలమీద
తచ్చాడుతూ ఉన్నారు.
పట్టణం మధ్య చెడుతనం, కష్టం ఉన్నాయి.
11 అందులో నాశనకరమైన క్రియలు
జరుగుతున్నాయి.
దాని వీధులనుంచి దౌర్జన్యం, వంచన విడిచిపోవు.
12 శత్రువు కాదు నన్ను దూషిస్తున్నది.
శత్రువైతే నేను సహించగలను.
నాకు పైగా కూర్చుని విర్రవీగేవాడు
పగవాడు కాదు.
పగవాడైతే అతడి దగ్గరనుంచి దాక్కొనేవాణ్ణి.
13 ఈ విధంగా చేసిన మనిషివి నీవే.
నీవు నా సహచరుడివి. నా మిత్రుడివి.
14 ఒకరితో ఒకరం మధురమైన సహవాసం
అనుభవించేవాళ్ళం.
ఉత్సవంగా వెళ్ళే గుంపుతో కలిసి దేవుని
ఆలయానికి నడిచేవాళ్ళం.
15 వాళ్ళ ఇండ్లలో, వాళ్ళ అంతరంగంలో
చెడుగు ఉంది.
వాళ్ళమీదికి నాశనం ఆకస్మికంగా వస్తుంది గాక!
ప్రాణంతోనే వాళ్ళు మృత్యు లోకానికి
దిగిపోతారు గాక!
16 నేను దేవునికి మొర పెట్టుకొంటాను.
యెహోవా నన్ను రక్షిస్తాడు.
17 సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం
త్రికాలాల్లో నేను మూలుగుతూ ధ్యానిస్తాను.
ఆయన నా స్వరం వింటాడు.
18 నాతో పోరాడేవాళ్ళు చాలామంది.
అయినా ఈ పోరాటంనుంచి నా ఆత్మను ఆయన
ప్రశాంతంగా ఉంచి రక్షిస్తాడు.
19 దేవుడు అనాది కాలంనుంచి సింహాసనాసీనుడు.
ఆయన వింటాడు.
వాళ్ళను అణచివేస్తాడు. (సెలా)
వాళ్ళు తమ బ్రతుకు తీరును మార్చుకోరు.
దేవుడంటే వాళ్ళకు భయమేమీ లేదు.
20 అలాంటివాడు తనతో సఖ్యంగా ఉన్నవాళ్ళమీద
చెయ్యి ఎత్తుతాడు.
తాను చేసిన ఒప్పందం తానే భంగం చేస్తాడు.
21 అతడి నోట్లోనుంచి వెలువడే మాటలు వెన్నలాగా
ఎంతో మెత్తనివి.
కాని, అతడి హృదయంలో యుద్ధం
చెలరేగుతూ ఉంటుంది.
అతడి మాటలు నూనెలాగా నునుపుగా ఉంటాయి.
కాని, అవి వర దీసిన ఖడ్గంలాంటివి.
22 నీ బరువంతా యెహోవామీద మోపు.
ఆయనే నీకు అండగా ఉంటాడు.
న్యాయవంతులను పడిపోనివ్వడు ఆయన.
23 దేవా, నీవు దుర్మార్గులను నాశనకరమైన
గుండంలో పడవేస్తావు.
రక్తపాతం జరిగించేవాళ్ళు, మోసగాండ్లు తమ
రోజుల్లో సగ భాగం కూడా బ్రతకరు.
కాని, నేను నిన్ను నమ్ముకొన్నాను.