గాయకుల నాయకుడికి. తంతి వాద్యాలతో పాడతగ్గది. జీఫ్‌వాళ్ళు సౌలుదగ్గరికి వెళ్ళి అతడితో దావీదు మా మధ్య దాగి ఉన్నాడని చెప్పాక దావీదు ఈ దైవధ్యానం రాశాడు.
54
1 దేవా, నీ పేరును బట్టి నన్ను రక్షించు!
నీ బలాన్ని పురస్కరించుకొని నాకు న్యాయం
చేకూర్చు!
2 దేవా, నా ప్రార్థన వినిపించుకో!
నా నోట వెలువడే మాటలు ఆలకించు!
3 పరాయివాళ్ళు నామీదికి ఎగబడుతున్నారు,
దౌర్జన్యపరులు నా ప్రాణం తీయజూస్తున్నారు.
దేవుడంటే వాళ్ళకు లెక్కలేదు. (సెలా)
4  ఇదిగో! నాకు సహాయం దేవుడే!
నా ఆత్మను ఆదరించేవాడు ప్రభువే!
5  నా శత్రుమూక తల పెట్టే కీడు వాళ్ళనే
బెడిసికొట్టేలా చేస్తాడు.
నీ సత్యం దృష్ట్యా వారిని నాశనం చెయ్యి!
6 స్వేచ్ఛగా నేను నీకు బలులు అర్పిస్తాను.
యెహోవా! నీ పేరు శ్రేష్ఠమైనది గనుక
దానిని స్తుతిస్తాను.
7 బాధలన్నిటినుంచి ఆయన నన్ను తప్పించాడు.
నా పగవాళ్ళకు పట్టిన గతి
నాకు కన్నుల పండుగ!