గాయకుల నాయకుడికి. రాగం: మహలత్. దావీదు రాసిన దైవధ్యానం.
53
1 ✽దేవుడు లేడంటూ మూర్ఖులు తలపోస్తారు.వాళ్ళు భ్రష్టులు, నీచ కార్యాలకు ఒడికట్టేవాళ్ళు.
మంచి చేసేవాడు ఒక్కడూ లేడు.
2 ✽దేవుడు పరలోకంనుంచి మనుషులను
పరిశీలనగా చూశాడు.
జ్ఞాన దృష్టితో ప్రవర్తించేవారెవరైనా
ఉన్నారా అని,
దేవుణ్ణి వెదికేవారెవరైనా ఉన్నారా అని
ఆయన చూశాడు.
3 ✽వాళ్ళంతా త్రోవ తప్పినవాళ్ళు.
అందరూ ఏకంగా వ్యర్థులయ్యారు.
మంచి చేసేవాడు లేడు, ఒక్కడూ లేడు.
4 చెడుగు చేసేవాళ్ళు గ్రహించరేమిటి!
వాళ్ళు దేవునికి ప్రార్థన చేయరు.
పైగా నా ప్రజలను ఆహారం మింగినట్టే
దిగమింగివేస్తారు.
5 ✽భయపడవలసిన అవసరం లేనప్పుడు
వాళ్ళకు చాలా భయం కలిగింది.
నిన్ను చుట్టుముట్టినవారి ఎముకలను దేవుడు
చెల్లా చెదురు చేశాడు.
దేవుడు వాళ్ళను త్రోసిపుచ్చాడు.
నీవు వాళ్ళకు తలవంపులు కలిగించావు.
6 అహో! సీయోనులోనుంచి ఇస్రాయేల్‌ప్రజకు
సంరక్షణ కలుగుతుంది గాక!
దేవుడు తన జనానికి క్షేమస్థితిని మళ్ళీ
కలిగించేటప్పుడు యాకోబుప్రజ ఆనందిస్తారు,
ఇస్రాయేల్‌జనం సంతోషిస్తారు.