గాయకుల నాయకుడికి. ఎదోందేశంవాడైన దోయేగు సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు అహీమెలెక్‌ ఇంటికి చేరాడని అతనితో చెప్పాక దావీదు ఈ దైవధ్యానం రాశాడు.
52
1 బలాఢ్యుడా! చెడుగు చేసి గొప్పలు
చెప్పుకుంటావెందుకు?
దేవుని అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
2 వంచకుడా! నీ నాలుక పదునైన
మంగలికత్తిలాంటిది.
అది నాశనకరమైన విషయాలు కల్పిస్తుంది.
3  నీకు మంచికంటే చెడుగు ఎక్కువ ఇష్టం.
నిజం చెప్పడంకంటే అబద్ధం చెప్పడం
నీకిష్టం. (సెలా)
4 మోసకరమైన నాలుకా!
నాశనకరమైన మాటలన్నీ నీకిష్టం గదా!
5 అందుచేత దేవుడు నిన్ను శాశ్వత
నాశనానికి గురి చేస్తాడు.
పట్టుకుని నీ డేరాలో నుంచి పీకివేస్తాడు నిన్ను.
సజీవుల లోకంలో లేకుండా నిన్ను
రూపుమాపుతాడు. (సెలా)
6 ఇదంతా చూచి న్యాయవంతులు భయభక్తులతో
ఉంటారు. అతణ్ణి చూచి నవ్వుతారు.
7 “చూడండర్రా ఈ పెద్ద మనిషి
దేవుణ్ణి తన ఆశ్రయం చేసుకోలేదు.
తన ధన సమృద్ధిమీద ఆధారపడ్డాడు.
నాశనకారకుడైన తన మార్గంలో
బలవంతుడయ్యాడు” అని చెప్పుకొంటారు.
8  కాని, నేను దేవుని ఆలయంలో పచ్చని
ఆలీవ్‌చెట్టులాగా ఉన్నాను.
దేవుని కరుణను నేను ఎప్పటికీ
నమ్ముకుంటున్నాను.
9 నీవు జరిగించినదానిని బట్టి నీకు
కృతజ్ఞతలు ఎల్లప్పుడు అర్పిస్తాను.
నీ పేరు శ్రేష్ఠమైనది.
నీ పేర నీ భక్తుల ఎదుట ఆశాభావంతో
ఎదురు చూస్తాను.