ఆసాపు కీర్తన
50
1 దేవుడు, యెహోవాదేవుడు మాట్లాడుతున్నాడు.
పొద్దు పొడిచే దిక్కునుంచి అది కుంకే దిక్కు వరకు
లోక ప్రజలందరినీ పిలుస్తున్నాడు.
2 ఏ లోపంలేని అందమైన సీయోను నగరంలో
నుంచి దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు.
3 మన దేవుడు వస్తాడు. నిశ్శబ్దంగా ఉండడు.
ఆయన ముందర దహించివేసే మంటలు బయలు
దేరుతాయి.
ఆయనచుట్టు తుఫాను గాలులు వీస్తున్నాయి.
4  తన ప్రజలకు ఆయన తీర్పు చెప్పబోతున్నాడు.
పైగా ఉన్న ఆకాశాలను పిలుస్తున్నాడు.
భూమిని పిలుస్తున్నాడు.
5 “నా భక్తులను అంటే, బల్యర్పణ మూలంగా
నాతో ఒడంబడిక చేసుకొన్నవారిని నా దగ్గర
సమకూర్చండి” అంటున్నాడు.
6 ఆకాశాలు ఆయన న్యాయాన్ని ప్రకటిస్తున్నాయి.
ఎందుకంటే దేవుడే న్యాయమూర్తిగా కూర్చుని
ఉన్నాడు. (సెలా)
7 “నా ప్రజలారా! వినండి.
నేను మాట్లాడబోతున్నాను.
ఇస్రాయేల్‌ప్రజలారా! వినండి.
మీ మీద సాక్ష్యం పలకబోతున్నాను.
నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.
8 మీ బలులను గురించి మీ మీద నేనేమీ
కోపపడడం లేదు.
మీరు సమర్పించే హోమాలు నా సమక్షంలో
ఎల్లప్పుడూ కనిపిస్తున్నాయి.
9 మీ ఇండ్లలోనుంచి ఎద్దు నాకక్కరలేదు.
మీ మందలోనుంచి పొట్టేలు నాకవసరం లేదు.
10 ఎందుకంటే అడవి మృగాలన్నీ నావే!
వేలకొలది కొండలపై ఉన్న పశువులు నావే!
11 కొండల మీద పక్షులన్నీ నాకు తెలుసు.
పచ్చిక మైదానాలపై తిరిగేవన్నీ నావి.
12 నాకు ఆకలైతే అది మీతో చెప్పను.
ఈ లోకం, అందులోని సమృద్ధి అంతా నాదే!
13 ఎద్దుల మాంసం నేను తింటానా?
పొట్టేళ్ళ రక్తం నేను త్రాగుతానా?
14 దేవునికి కృతజ్ఞతలు అర్పించండి.
సర్వాతీతుడికి మీరు మ్రొక్కుకొన్నదేదో
అర్పించండి.
15  ఆపద సంభవించే రోజున నన్ను పిలువు.
నీకు విడుదల ప్రసాదిస్తాను,
నీవు నాకు మహిమ తెస్తావు.”
16 దుర్మార్గుడితో దేవుడు చెపుతున్న మాట ఇదే:
“నా శాసనాలు వివరిస్తున్నావేమిటి?
నా ఒడంబడిక నీ నోట పలుకుతావేమిటి?
17 క్రమశిక్షణ నీకు అసహ్యం గదా!
నా మాటలను నీవు వెనక్కు నెట్టివేస్తావు గదా!
18 దొంగ కనబడితే సరి, వాడి స్నేహంవల్ల
నీకు సంతోషమే.
వ్యభిచారం చేసేవాళ్ళకు నీవు బాగా పరిచయం!
19 నీవు నోరు తెరిస్తే సరి, కీడు ఉట్టి పడుతుంది.
నీ నాలుక మోసం కల్పిస్తుంది.
20 ఇతరులతో కూర్చుని నీ సోదరుడిమీద
లేనిపోనివి చెప్తావు.
నీ తల్లికి అతడు కొడుకే గాని అతని మీద
అపనిందలు వేస్తావు.
21 నీవిదంతా చేశావు. అయినా నేను మౌనం
వహించి సహించాను.
గనుక నేనూ నీలాంటివాణ్ణే అనుకొన్నావు గదా.
ఇప్పుడు ఈ విషయాన్ని నీ దృష్టికి తేటగా
చూపుతాను, నిన్ను ఒప్పిస్తాను.
22 దేవుణ్ణి మరిచిపోయేవారలారా,
ఈ విషయం మనసుకు పట్టించుకోండి!
లేదా, నేను మిమ్ములను ముక్కలుగా చీల్చివేస్తాను.
మిమ్ములను కాపాడే వాడెవడూ ఉండడు.
23 కృతజ్ఞతలు అర్పించేవాడు నన్ను గౌరవిస్తున్నాడు.
దేవుని రక్షణ అతనికి నేను చూపెట్టేలా
అతడు మార్గం సిద్ధం చేస్తున్నాడు.”