గాయకుల నాయకుడికి. కోరహు సంతతివారి కీర్తన.
49
1 ✽సర్వ ప్రజలారా! ఈ విషయం వినండి.లోక నివాసులారా! మీరంతా ఈ సంగతి
చెవిని బెట్టండి.
2 అల్పులూ అధికులూ ధనికులూ
పేదలూ అందరూ ఆలకించండి.
3 తెలివైన మాటలు నా నోరు పలకబోతున్నది.
నా హృదయంలోని తలంపులు వివేకం గలవి.
4 నా చెవులకు సోకుతున్న సామెతమీద
నా మనసు పెట్టి,
తంతివాద్యం వాయిస్తూ, పొడుపు కథ విప్పుతాను.
5 ✽నన్ను పడగొట్టదలచేవాళ్ళ దుష్‌కృత్యాలు
నా చుట్టు కనిపించే చెడ్డ రోజులు
వచ్చినా నేనెందుకు భయపడాలి?
6 వాళ్ళకు తమ ఆస్తిపాస్తులమీదే నమ్మకం.
తమ అధిక సంపద విషయం విర్రవీగుతూ
ఉంటారు వాళ్ళు.
7 ✽ఎవ్వడూ తన సాటి మనిషిని విడుదల చేయలేడు,
విడుదలకోసం కావలసినంత వెల దేవునికి
చెల్లించలేడు.
8 వారి ఆత్మ విముక్తికి చెల్లించవలసిన వెల
ఎంతో గొప్పది.
9 తాను సమాధిని తప్పించుకుని ఎల్లకాలం
బ్రతికేందుకు మనిషి ఆ వెల
ఎన్నటికీ చెల్లించలేడు.
10 ✝ప్రతి వ్యక్తీ ఇది చూస్తాడు:
తెలివైనవాళ్ళూ, తెలివితక్కువవాళ్ళూ,
పశుప్రాయులూ ఏకంగా చస్తారు.
వాళ్ళంతా అంతరించి తమ ధనధాన్యాలు
ఇతరులకు వదలివేస్తారు.
11 ✽ తమ ఇండ్లు చిర స్థాయిగా ఉంటాయని
అనుకుంటున్నారు.
తమ నివాసాలు తరతరాలకు నిలిచి ఉంటాయని
వాళ్ళ భావన.
తమ భూములకు తమ పేర్లే పెట్టుకుంటారు.
12 ✝కాని, మనుషులు అలాంటి ఘన స్థితిలో నిలవలేరు.
నాశనమయ్యే జంతువులలాగా ఉన్నారు.
13 ✽వాళ్ళది తెలివితక్కువ ఆశాభావం.
వాళ్ళకు పట్టే గతి ఇదే.
వాళ్ళ మాటలను మెచ్చుకొంటూ
వాళ్ళను అనుసరించేవాళ్ళకు
కూడా అంతే. (సెలా)
14 గొర్రెల మందలాగా వాళ్ళు త్రోసుకుపోతూ,
మృత్యు లోకంలోకి సాగిపోతూ ఉన్నారు.
వాళ్ళ కాపరి మరణమే!
ఉదయాన్నే యథార్థపరులు వాళ్ళను పరిపాలిస్తారు.
వాళ్ళు తమ నివాసాలు విడిచి మృత్యులోకానికి
వెళ్ళిపోతారు.
అక్కడ వాళ్ళ రూపం పాడైపోతుంది.
15 కాని, దేవుడు నా ప్రాణాన్ని మృత్యులోక
శక్తినుంచి తప్పకుండా విడుదల✽ చేస్తాడు,
నన్ను చేర్చుకుంటాడు✽. (సెలా)
16 ✽ఎవడో మనిషి ధనికుడయ్యాడనీ
అతడి ఇంటి వైభవం వృద్ధి చెందిందనీ
భయపడకండి.
17 అతను కాలం చేసేటప్పుడు తనతో ఏమీ
తీసుకుపోడు.
అతడి వైభవం అతడి వెంట దిగిపోదు.
18 ✝అతడు బ్రతికినన్నాళ్ళు ఆత్మస్తుతి చేసుకుంటాడు.
ఇతరులు “నీ వ్యవహారాలు బాగా
నిర్వహించుకున్నావు” అంటారు.
19 ✽అయినా అతడు తన పూర్వీకుల తరంలో
కలిసిపోతాడు.
వారికి వెలుగంటూ మరెన్నడూ కనబడదు.
20 తెలివితక్కువవాళ్ళు ఘన స్థితిలో ఉన్నా,
చచ్చే జంతువులలాగా ఉంటారు.