ఒక పాట. కోరహు సంతతివారి కీర్తన.
48
1 యెహోవా మహత్తు గల దేవుడు.
మన దేవుని నగరంలో,
ఆయన పవిత్ర పర్వతం మీద ఆయన
అధిక స్తుతిపాత్రుడు.
2 సీయోను పర్వతం ఎత్తైనది, అందమైనది.
అది లోకమంతటికీ ఆనందదాయకం.
ఆ నగరం ఉత్తర దిక్కున ఉంది.
అది మహారాజు పట్టణం.
3 దేవుడు ఆశ్రయంగా ఉన్నాడని
ఆ నగర భవనాలలో తెలిసిన విషయమే.
4 ఎలాగంటే రాజులు సమకూడారు,
కలిసి కట్టుగా వచ్చారు.
5 వాళ్ళు ఈ నగరాన్ని చూడగానే విభ్రాంతి చెందారు
అత్యంత భయంతో పారిపొయ్యారు.
6 అక్కడ వాళ్ళు గజగజ వణికిపొయ్యారు.
ప్రసవ వేదనలాంటి బాధ వాళ్ళకు పట్టింది.
7 దేవా, నీవు తూర్పుగాలి వీచేలా చేసి,
తర్షీష్‌ఓడలు బ్రద్దలు చేశావు.
8 మనం విన్న విషయాలలాంటివే ఇక్కడ జరిగాయి.
సేనల ప్రభువు యెహోవా పట్టణంలో,
మన దేవుని నగరంలో వాటిని చూశాం.
ఈ నగరం ఎప్పటికీ సుస్థిరంగా ఉండేలా
చేస్తాడు దేవుడు. (సెలా)
9 దేవా, నీ ఆలయంలో ఉండి
నీ అనుగ్రహాన్ని మేము ధ్యానించాం.
10 దేవా, నీ పేరులాగే నీ ప్రఖ్యాతి
భూమి కొనలకు వ్యాపించి ఉంది.
నీ కుడి చేతినిండా న్యాయం ఉంది.
11 న్యాయసమ్మతమైన నీ తీర్పుల కారణంగా
సీయోను పర్వతం ఆనందిస్తుంది.
యూదాలో ఉన్న గ్రామాలు సంతోషిస్తాయి.
12 సీయోను నగరం చుట్టూ నడవండి.
అలా ప్రదక్షిణం చేస్తూ దాని బురుజులెన్నో
లెక్కపెట్టండి.
13 కోట గోడలను బాగా చూడండి.
దాని భవనాలను పరిశీలించండి.
ఇదంతా రాబొయ్యే తరంవారికి చెప్పగలిగేలా
ఆవిధంగా చెయ్యండి.
14 ఎందుకంటే, ఇక్కడున్న దేవుడే శాశ్వతంగా
మన దేవుడు.
మనం మృతి పొందేవరకు ఈయన మనకు మార్గదర్శి.