గాయకుల నాయకుడికి. రాగం: కలువలు. కోరహు సంతతివారిది. ఒక దైవధ్యానం. ప్రేమను గురించిన పాట (వివాహ సంగీతం).
45
1 ✽✽నా హృదయం ఓ మంచి విషయంతో పొంగిపొర్లిపోతూ ఉంది.
నేను చెప్పేది రాజును గురించిన కావ్యం.
నా నాలుక త్వరగా వ్రాసేవాడి
కలంలాంటిది.
2 ✽మనుషులందరి కంటే నీవు ఉత్తముడవు.
నీ పెదవుల మీద దయ పోయబడింది.
అందుచేత దేవుడు నీకు ప్రసాదించిన
ఆశీస్సులు శాశ్వతమైనవి.
3 ✽బలాఢ్యుడా! నీ కత్తి కట్టుకో!
నీ ప్రకాశమూ ప్రతాపమూ ధరించుకో!
4 వైభవంతో విజయవంతంగా తరలివెళ్ళు!
సత్యం, వినయం, న్యాయం పక్షంగా
ముందుకు సాగిపో!
నీ కుడి చేయి నీకు భయంకర క్రియలు
ప్రదర్శిస్తుంది.
5 నీ బాణాలు వాడిగా ఉన్నాయి.
అవి రాజ శత్రువుల గుండెల్లో
గుచ్చుకుంటాయి.
నీ పాదాల క్రింద జనాలు కూలిపోతారు.
6 దేవా✽! నీ సింహాసనం శాశ్వతంగా ఉంటుంది.
నీ రాజదండం న్యాయ✽ దండం.
7 ✽న్యాయమంటే నీకు ఎంతో ఇష్టం.
అన్యాయాన్ని అసహ్యించుకొన్నావు.
అందుచేత దేవుడు, నీ దేవుడు నిన్ను
నీ సహచరులకంటే ఎక్కువగా
ఆనంద తైలంతో అభిషేకించాడు
8 ✽నీవు ధరించిన వస్త్రాలన్నీ బోళం,
అగరు, లవంగపట్ట సుగంధంతో
గుభాళిస్తున్నాయి.
దంతంతో కట్టిన భవనాలలోనుంచి
తంతివాద్యాల వాదనం
నీకు ఆనందం కలిగిస్తుంది.
9 ఘనత వహించిన నీ పరివారంలో
రాజుల కుమార్తెలు ఉన్నారు.
ఓఫీరుదేశం బంగారు ఆభరణాలతో
అలంకరించుకొని రాణి నీ
కుడిప్రక్కన నిలబడి ఉంది.
10 ✽కుమారీ, విను! శ్రద్ధగా
ఈ మాటలు చెవిని వేసుకో!
నీ సొంత ప్రజలనూ నీ పుట్టింటినీ
మరిచిపో!
11 రాజు నీ అందాన్ని కోరుతాడు.
ఆయన నీ ప్రభువు. ఆయనకు నమస్కరించు.
12 ✽తూరు కుమారి కానుక తెస్తుంది.
ప్రజల్లో ధనికులు నిన్ను పొగడుతారు.
13 ✽అంతఃపురంలో రాకుమారి వైభవం
సంపూర్ణమైనది.
ఆమె ధరించిన వస్త్రాలు బంగారంతో
బుట్టా వేసినవి.
14 ఆమె వస్త్రాలంకారం వివిధమైన
రంగులు గలది.
ఆమెను రాజుదగ్గరికి తీసుకువస్తారు.
ఆమె వెంట ఆమె కన్యలైన చెలికత్తెలు
కూడా నీ దగ్గరికి వస్తారు.
15 ఆనందంతో, ఉత్సాహంతో వారు వస్తారు,
రాజభవనంలో ప్రవేశిస్తారు.
16 ✽నీ పూర్వీకుల స్థానంలోనే
నీ కుమారులుంటారు.
లోకమంతటా వారిని యువరాజులుగా
నీవు నియమిస్తావు.
17 తరతరాలు నీ పేరును స్మరించేలా చేస్తాను.
గనుక లోక జనాలు నిన్ను
శాశ్వతంగా స్తుతిస్తాయి.