గాయకుల నాయకుడికి. కోరహు సంతతివారిది. ఒక దైవధ్యానం.
44
1 ✽దేవా, మేము చెవులార విన్నాం,మా పూర్వీకుల రోజుల్లో,
ఆ పురాతన కాలంలో,
నీవు చేసినది వారు మాకు చెప్పారు.
2 ✽నీ సొంత చేతితో ఇతర జాతులను
వెళ్ళగొట్టావు,
మా పూర్వీకులను ఇక్కడ నిలబెట్టావు.
నీవు ఆ ప్రజలను కీడులకు గురి చేశావు,
మా పూర్వీకులు వ్యాపించేలా చేశావు.
3 ✝తమ కత్తితో ఈ దేశాన్ని
వశం చేసుకోలేదు వారు.
తమ భుజబలంతో విజయం సాధించలేదు.
నీ కుడి చెయ్యి, నీ భుజబలం,
నీ ముఖకాంతి వీటి మూలంగానే
విజయం సిద్ధించింది.
నీవు వారిని కటాక్షించావు.
4 ✽ దేవా, నీవే నా రాజువు.
యాకోబు ప్రజలకు సంపూర్ణ విముక్తి
కలిగించు.
5 ✽మా విరోధులను నీద్వారా పడదోసివేస్తాం.
మా పైబడేవాళ్ళను నీ పేర అణగదొక్కివేస్తాం.
6 నా ధనుస్సుమీద నేను నమ్మకం పెట్టను.
నా ఖడ్గం నన్నేమీ గెలిపించదు.
7 మా విరోధులమీద మాకు విజయం
సాధించేది నీవే.
మా పగవాళ్ళకు ఆశాభంగం కలిగించేది నీవే.
8 ✽దేవునిలోనే మాకు ఎడతెగని అతిశయం!
నీ పేరును మేము శాశ్వతంగా స్తుతిస్తాం! (సెలా)
9 ✝ఇప్పుడైతే నీవు మమ్మల్ని విడిచి
సిగ్గుపాలు చేశావు.
మా సైన్యంతో నీవు రావడం లేదు.
10 మా విరోధులకు వెన్ను చూపి
పారిపొయ్యేలా చేశావు.
మా పగవాళ్ళు మమ్మల్ని దోపిడీ చేసుకొంటున్నారు.
11 గొర్రెలలాగా మమ్మల్ని ఆహారంగా వారికిచ్చావు.
ఇతర ప్రజలలో మమ్మల్ని చెదరగొట్టావు.
12 తక్కువ వెలకు, లాభమేమీ పొందకుండా
నీ ప్రజలను అమ్మివేశావు.
13 ✝మా ప్రక్కవారి దూషణకు మమ్మల్ని గురిచేశావు.
చుట్టూ ఉన్న వాళ్ళకు మేమంటే మరీ వెటకారమూ,
పరిహాసమూ అయిపొయ్యేలా చేశావు.
14 ఇతర ప్రజల నోట నానిపొయ్యేలా మమ్మల్ని చేశావు.
వారు మమ్మల్ని చూచి తలలూపేలా చేశావు.
15 హేళన, దూషణ చేసేవాళ్ళ కారణంగా,
పగ తీర్చుకొనే శత్రువుల సముఖం కారణంగా
16 రోజంతా నాకు తలవంపులే.
నా ముఖంమీది సిగ్గు నన్ను ఆవరించి ఉంది.
17 ✽ఇదంతా మా మీదికి వచ్చి పడింది.
అయినా మేము నిన్ను మరువలేదు.
నీ ఒడంబడిక విషయం
నమ్మకద్రోహులం కాలేదు.
18 మా హృదయం వెనక్కు తీయలేదు.
మా పాదాలు నీ మార్గంనుంచి వైదొలగలేదు.
19 నక్కలున్న చోట నీవు మమ్మల్ని
బాగా నలగ్గొట్టావు.
చావునీడ మమ్మల్ని ఆవరించేలా చేశావు.
20 ✽ఒకవేళ మేము మా దేవుని పేరు మరచి ఉంటే, పరాయి దేవుడివైపుకు చేతులు చాపి ఉంటే,
21 ✝దేవుడు ఈ విషయం పసిగట్టకపోతాడా?
హృదయంలో దాగివున్న విషయాలు
ఆయనకు తెలుసు.
22 ✽నీ కోసమే మేము రోజంతా హతం అవుతున్నాం.
వధకు తగ్గ గొర్రెలుగా మమ్మల్ని ఎంచుతున్నారు.
23 ✽ ప్రభూ! మేల్కో! ఎందుకీ నిద్ర! లే!
మమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టి ఉండబోకు!
24 ✝నీవెందుకు ముఖం చాటు చేసుకొంటావు?
మా బాధను, హింసను నీవెందుకు
మరచిపోతావు?
25 ✽మా ప్రాణం నేలవరకు కుంగిపోయింది.
మా శరీరం నేలకు అంటుకుపోయింది.
26 ✽లే! మాకు సహాయం చెయ్యి!
నీ అనుగ్రహం కారణంగా మమ్మల్ని విడిపించు.