రెండో భాగం
(కీర్తనలు 42—72)
గాయకుల నాయకుడికి. కోరహు సంతతివారి దైవధ్యానం.
42
1 ✽✽దుప్పి నీటి ధారలకోసం తహతహలాడినట్టేనా అంతరంగం నీ కోసం
తహతహలాడుతూ ఉంది, దేవా!
2 ✽నా ఆత్మ దేవునికోసం, సజీవుడైన దేవునికోసం
తపన చెందుతూ ఉంది.
దేవుని సముఖంలోకి నేనెప్పుడు వస్తాను?
అక్కడ ఎప్పుడు కనబడుతాను?
3 రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళే అన్నపానాలు
అయ్యాయి నాకు!
ఎందుకంటే “నీ దేవుడేడి? ఎక్కడున్నాడు?”
అంటూ రోజంతా అదే పనిగా అడిగారు కొందరు.
4 ఇవి జ్ఞప్తికి తెచ్చుకొని తలపోసుకొంటున్నాను.
ఒకప్పుడు జనసమూహంతో ఊరేగింపులో
దేవాలయానికి దారి చూపుతూ వెళ్ళేవాణ్ణి.
ఆనందధ్వనులతో దేవుణ్ణి స్తుతిస్తూ✽,
మహోత్సవాన్ని ఆచరించేవాళ్ళం మేము.
5 మనసా, నీవెందుకు ఇలా కుంగిపోతావు?
నాలో ఎందుకలా ఘోషిస్తావు?
దేవునిమీద ఆశాభావం ఉంచు.
ఆయనే నా రక్షణ, నా దేవుడు.
ఇంకా ఆయనను స్తుతిస్తాను.
6 ✽నా దేవా, నా మనసు కుంగిపోయి ఉంది.
గనుక యొర్దాను ప్రదేశంనుంచి, హెర్మోను
శిఖరాలనుంచి, మిసార్‌కొండనుంచి
నేను నిన్ను తలచుకొంటాను.
7 ✽నీటి ప్రవాహాల గర్జన మూలంగా జలాగాధం
జలాగాధాన్ని పిలుస్తూ ఉంది.
నీ తరంగాలూ అలలూ అన్నీ నా మీదుగా
పొర్లిపారాయి.
8 ✽పగలు యెహోవా తన అనుగ్రహాన్ని పంపిస్తాడు.
రాత్రి✽ ఆయన పాట నాకు తోడుగా ఉంటుంది,
అది నాకు జీవదాతగా ఉన్న దేవునికి✽ ఒక ప్రార్థన.
9 నాకు ఆధారశిల✽గా ఉన్న దేవునితో అంటాను,
“నన్ను మరచిపోయావెందుకు? శత్రువులు
నన్ను అణగదొక్కుతూ ఉంటే శోకమూర్తినై
నేనెందుకిలా వెళ్ళాలి?”
10 “నీ దేవుడేడి? ఎక్కడున్నాడు?” అంటూ
రోజంతా అదే పనిగా నా శత్రువులు
అడుగుతున్నారు.
వారిలా నన్ను గేలి చేస్తూ ఉంటే
నా ఎముకలు విరిచినట్లనిపిస్తుంది.
11 మనసా, ఎందుకు ఇలా కుంగిపోతావు?
నాలో ఎందుకిలా ఘోషిస్తావు?
దేవుని మీద ఆశాభావం ఉంచు. ఆయనే నా రక్షణ,
నా దేవుడు. ఇంకా ఆయనను స్తుతిస్తాను.