గాయకుల నాయకుడికి. దావీదు కీర్తన
41
1 ✽దిక్కులేనివారికి సహాయం చేసే వ్యక్తి ధన్యజీవి.కీడు కాలంలో యెహోవా ఆ వ్యక్తిని విడుదల
చేస్తాడు.
2 యెహోవా అతణ్ణి కాపాడుతాడు,
అతడి ప్రాణం దక్కిస్తాడు.
భూమిమీద అతడికి ఎంతో క్షేమం.
నీవు అతణ్ణి శత్రువుల పేరాశకు వదలివెయ్యవు.
3 ✽మంచం పట్టినప్పుడు అతణ్ణి
యెహోవా ఆదరిస్తాడు.
రోగంతో పడుకొన్న అతడి పడక
నీవు మార్చివేస్తావు.
4 ✽నేనిలా అన్నాను: “యెహోవా, నన్ను
దయ చూడు!
నా అంతరంగానికి ఆరోగ్యం ప్రసాదించు!
నేను నీకు వ్యతిరేకంగా✽ పాపం చేశాను.
5 ✝నా శత్రువులు నా గురించి చెడుగా
చెప్పుకొంటున్నారు.
“వీడెప్పుడు చస్తాడో, వీడి నామరూపాలు
ఎప్పుడు లేకుండా పోతాయో!” అంటారు.
6 ✝నన్ను చూడడానికి ఎవడైనా వస్తే
అబద్ధమాడుతాడు.
నిరాధారమైన సంగతులు లోలోపల
పోగు చేసుకొంటాడు.
బయటికి వెళ్ళి బహిరంగంగా వాటిని వాగుతాడు.
7 ✝నన్ను ద్వేషించేవాళ్ళంతా కలిసి నాకు
వ్యతిరేకంగా గుసగుసలాడుతారు.
నాకు కీడు చేయాలని దురాలోచన చేస్తారు.
8 ✽ “అతడికి వినాశకరమైనది ముంచుకు వచ్చింది.
అతడు పడుకొన్న పడకనుంచి మళ్ళీ లేవలేడు”
అంటారు వాళ్ళు.
9 ✽నా స్నేహితుడు కూడా, నేను నమ్మిన మనిషి,
నా రొట్టె నాతో తిన్నవాడు నన్ను
తన్నడానికి మడిమ ఎత్తాడు.
10 ✽యెహోవా! నన్ను దయ చూడు!
నన్ను లేవనెత్తు.
అప్పుడు నేను వాళ్ళకు ప్రతీకారం✽ చేస్తాను.
11 ✽ నా శత్రువు నా మీద జయధ్వనులు చేయలేడు.
నేనంటే నీకు అనురాగమని దీనివల్ల నాకు తెలుసు.
12 ✝నేను నిజాయితీగలవాణ్ణి గనుక పడిపోకుండా
నన్ను నిలుపుతావు నీవు.
నీ సముఖంలో ఎప్పటికీ నన్ను నిలబెట్టుకొంటావు.
13 ✝ఇస్రాయేల్‌ప్రజల దేవుడైన యెహోవా
యుగాలనుంచి యుగాలవరకు శాశ్వతంగా
స్తుతిపాత్రుడు!
తథాస్తు! తథాస్తు!