గాయకుల నాయకుడికి. దావీదు కీర్తన.
40
1 యెహోవాకోసం నేను ఓర్పుతో ఎదురు చూశాను.
ఆయన నావైపు వంగి నా మొర ఆలకించాడు.
2 వినాశకరమైన గుంటలోనుంచి నన్ను పైకి లాగాడు.
బంకమట్టితో నిండి ఉన్న దొంగ ఊబిలోనుంచి తీసి,
నా పాదాలను బండమీద నిలబెట్టాడు,
నా అడుగులు సుస్థిరం చేశాడు.
3 ఆయన నా నోట కొత్త పాటను ఉంచాడు.
అది మన దేవునికి స్తుతిపాట.
అనేకులు ఇది చూచి భయభక్తులు కలిగి
యెహోవా మీద నమ్మకం ఉంచుతారు.
4  గర్విష్ఠులనూ, నమ్మకూడని దానికోసం మార్గం
విడిచిన వాళ్ళనూ అనుసరించకుండా
యెహోవానే నమ్ముకొన్నవారు ధన్యజీవులు.
5 యెహోవా! నా దేవా!
మాపట్ల నీవు చేసిన అద్భుతాలు,
మా విషయంలో నీకున్న భావాలు అనేకం.
వాటిని వివరించి చెపుదామనుకొంటే వాటిని
లెక్కించడం నా తరం కాదు.
నీవు సాటి లేనివాడవు.
6 బలిని గానీ యజ్ఞాన్ని గానీ నీవు కోరలేదు.
నేను నీ మాట వినేలా చేశావు.
హోమాలనూ, నైవేద్యాలనూ నీవు కోరలేదు.
7 అప్పుడు నేనిలా చెప్పాను:
“ఇదిగో నేను వచ్చాను.
గ్రంథం చుట్టలో నన్ను గురించి వ్రాసి ఉంది.
8 నా దేవా, నీ సంకల్పం సాధించడమే
నాకు సంతోషం.
నీ ధర్మశాస్త్రం నా అంతరంగంలో ఉంది.”
9 నేను మహా సమావేశంలో న్యాయాన్ని గురించిన
శుభవార్త ప్రకటించాను.
ఇక నా పెదవులు మూసుకోను.
యెహోవా, ఇది నీకు తెలుసు.
10 నా హృదయంలో ఉన్న నీ న్యాయాన్ని నేనేమీ
దాచలేదు.
నీ విశ్వసనీయతనూ, నీ విముక్తినీ నేను
వెల్లడి చేశాను.
నీ అనుగ్రహాన్నీ నీ సత్యాన్నీ మహా సమావేశంలో
దాచుకోకుండా బయలుపరచాను.
11 యెహోవా, నీ వాత్సల్యం నాకు కాకుండా చేయవు.
నీ అనుగ్రహమూ నీ సత్యమూ ఎడతెగకుండా
నన్ను కాపాడుతాయి.
12 లెక్క పెట్టలేనన్ని ఆపదలు నన్ను ఆవరించి ఉన్నాయి.
నా అపరాధాలు నన్ను అందుకొన్నాయి.
నేనేమీ చూడలేకపోతున్నాను.
నా అపరాధాలు నా తలవెండ్రుకల కంటే ఎక్కువ.
నా గుండె జారిపోయింది.
13 యెహోవా! దయ చూచి నన్ను విడిపించు!
యెహోవా! త్వరగా వచ్చి నాకు సహాయం చెయ్యి.
14 నా ప్రాణం తీయాలని వెదికేవాళ్ళంతా ఆశాభంగానికీ
సిగ్గుకూ గురి అవుతారు గాక!
నా దురవస్థను చూస్తామనుకొనే వాళ్ళంతా
అవమానంతో వెనక్కు పడుతారు గాక!
15 నన్ను చూచి “ఆహాహా!” అని గేలి చేసేవాళ్ళు
ఆశాభంగం పొంది మ్రాన్పడిపోతారు గాక!
16 నిన్ను వెదికేవాళ్ళంతా నీ మూలంగా
ఆనందభరితులై సంతోషిస్తారు గాక!
నీవిచ్చే విముక్తి ఎవరికి ప్రియమైనదో వారంతా
“యెహోవా కీర్తి అధికం కావాలి”!
అని ఎప్పుడూ అంటారు గాక!
17 నేను దీనదశలో ఉన్నాను.
అక్కరలో ఉన్నాను.
అయితే ప్రభువు నా విషయం ఆలోచిస్తాడు.
నీవే నా సహాయం, నా విముక్తిదాతవు.
నా దేవా! ఆలస్యం చేయకు!